NTA: ఆఫ్‌లైన్ పరీక్షలను తగ్గించి.. ఆన్‌లైన్, హైబ్రిడ్ పద్ధతులను ఎంచుకోండి
ABN , Publish Date - Oct 31 , 2024 | 05:47 AM
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కార్యకలాపాలను సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ప్రవేశ పరీక్షల్లో పలు సంస్కరణలను సూచిస్తూ నివేదిక సిద్ధం చేస్తోంది.
ఎన్టీఏ, పరీక్షల నిర్వహణపై రాధాకృష్ణన్ కమిటీ సిఫారసులు!
న్యూఢిల్లీ, అక్టోబరు 30: జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కార్యకలాపాలను సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ప్రవేశ పరీక్షల్లో పలు సంస్కరణలను సూచిస్తూ నివేదిక సిద్ధం చేస్తోంది. ఎన్టీఏ నిర్వహణపై సమీక్ష జరిపేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ చైర్మన్ ఆర్.రాధాకృష్ణన్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తుది నివేదికను సమర్పించేందుకు రెండు వారాల గడువు కావాలని ఈ నెల 21న కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. నివేదిక దాదాపు పూర్తయిందని, ఎన్టీఏ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, దేశంలో పెద్దపెద్ద ప్రవేశ పరీక్షల నిర్వహణలో చేపట్టాల్సిన సంస్కరణలపై పలు సిఫారసులు చేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
సాధారణ (ఆఫ్‌లైన్) పరీక్షలను తగ్గించడం లేదా పూర్తిగా ఆన్‌లైన్ అవకాశం లేని పరిస్థితుల్లో హైబ్రిడ్ విధానాన్ని ఎంచుకోవడం; నీట్ సహా పలు ప్రధాన పరీక్షలను రాసే సంఖ్యపై పరిమితి విధించడం; ఔట్‌సోర్స్ సిబ్బంది, పరీక్ష కేంద్రాల పాత్రను తగ్గించడం ద్వారా పరీక్షల పవిత్రతను కాపాడడం వంటి సిఫారసులు చేసినట్లు వెల్లడించాయి. భారీ స్థాయిలో నిర్వహించే పరీక్షల్లో ఎదురయ్యే సమస్యలు, సవాళ్లను పరిష్కరించే అంశంపై చర్చించేందుకు కమిటీ 22 సార్లు సమావేశమైంది. కమిటీకి 37 వేలకు పైగా సలహాలు, సూచనలు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.