Himachal Pradesh: అమ్మాయిల వివాహ వయోపరిమితి 21 ఏళ్లకు పెంపు.. క్యాబినెట్ నిర్ణయం
ABN , Publish Date - Jan 12 , 2024 | 09:11 PM
రాష్ట్రంలో అమ్మాయిల వివాహ వయో పరిమితిని 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ హిమాచల్ ప్రదేశ్ క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
సిమ్లా: రాష్ట్రంలో అమ్మాయిల వివాహ వయో పరిమితిని 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు (Sukhvinder Singh Sukhu) అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
అమ్మాయిల చట్టబద్ధ వివాహ వయోపరిమితిని పెంచే విషయంలో సాధ్యాసాధ్యాలపై హిమాచల్ సర్కార్ గత ఏడాది డిసెంబర్‌లో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్‌పర్సన్ ఎం.సుధాదేవి ఆధ్వర్యంలో వివిధ రంగాల నిపుణులు, అధికారులతో కమిటీ ఏర్పాటైంది. గ్రామీణాభివృద్ధి కార్యదర్శి పి.మండల్, న్యాయశాఖ కార్యదర్శి శరద్ కుమార్ లాగ్వాల్, లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ డైరెక్టర్ మానసి సహాయ్ ఠాకూర్, ట్రిబ్యూన్ వార్తాపత్రిక బ్యూరో చీఫ్ ప్రతిభా చౌహాన్ తదితరులతో ఈ కమిటీ ఏర్పడింది. కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రంలో అమ్మాయిల చట్టబద్ధ వివాహ వయోపరిమితిని 18 నుంచి 21కి పెంచుతూ తాజాగా సుఖ్వీందర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తమ కాళ్లపై తాము నిలబడని తరువాతే వివాహం చేసుకోవాలనే స్పృహ యువతరం అమ్మాయిల్లో పెరగడం, వివాహానికి అనువైన పరిణితి వారిలో పెరిగేందుకు అనుగుణంగా వయోపరిమితి పెంపు నిర్ణయం తీసుకున్నట్టు హిమాచల్ సర్కార్ ప్రకటించింది.