రాజ్యాంగవజ్రోత్సవం
ABN , Publish Date - Nov 27 , 2024 | 03:30 AM
ఎనిమిది షెడ్యూళ్లు.. 22 అధ్యాయాలు.. 395 అధికరణలతో రూపొందించిన భారత రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు..
ఎనిమిది షెడ్యూళ్లు.. 22 అధ్యాయాలు.. 395 అధికరణలతో రూపొందించిన భారత రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు.. 1949, నవంబరు 26! ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ప్రఖ్యాతిగాంచిన మన రాజ్యాంగం ఆమోదం పొంది.. 75 సంవత్సరాలైన సందర్భంగా రాజ్యాంగానికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు..
1934లో తొలిసారి మానవేంద్రనాథ్ రాయ్ రాజ్యాంగ సభ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. 1935 నుంచి అది కాంగ్రెస్ అధికారిక డిమాండ్‌గా మారింది.
భారత రాజ్యాంగ రచనకు పట్టిన సమయం.. రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు.
రాజ్యాంగ రచన పూర్తైన తర్వాత.. దాన్ని మిగతా దేశాల రాజ్యాంగాల్లాగా ప్రచురించలేదు. క్యాలిగ్రఫీలో మాస్టర్‌గా పేరొందిన ప్రేమ్ బిహారీ నారాయణ్ హిందీ, ఇంగ్లిష్ భాషల్లో చేతితో రాశారు. ఆ రాజ్యాంగ తొలి ప్రతులను పార్లమెంటు హౌస్‌లోని లైబ్రరీలో హీలియం పెట్టెల్లో భద్రపరిచారు.
ప్రస్తుతం మన రాజ్యాంగంలో 25 అధ్యాయాలు, 448 అధికరణలు, 12 షెడ్యూళ్లు ఉన్నాయి.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దాదాపు ఏడాదిన్నర తర్వాత.. 1951 జూన్ 18న తొలి సవరణ జరిగింది. చివరిదైన 106వ సవరణ.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించింది. దీన్ని గత ఏడాది డిసెంబరులో ఆమోదించారు.
రాజ్యాంగ రూపకల్పనలో.. దాక్షాయణి అనే దళిత మహిళ, తెలుగింటి కోడలు సరోజినీనాయుడు సహా 15 మంది మహిళలు రాజ్యాంగ సభ సభ్యులుగా కీలకపాత్ర పోషించారు.
106 ఏడున్నర దశాబ్దాల కాలంలో జరిగిన రాజ్యాంగ సవరణల సంఖ్య.
1,46,000 ప్రపంచంలోనే అతి పెద్దదైన మన రాజ్యాంగంలో ఉన్న పదాల సంఖ్య.. దాదాపుగా 1,46,000
రూ.64 లక్షలు రాజ్యాంగ రచనకు అయిన ఖర్చు.. ఆరోజుల్లోనే అక్షరాలా అరవై నాలుగు లక్షల రూపాయలు!!