Share News

Gaganyaan Mission: ఆ నలుగురు వ్యోమగాములు ఎవరు? వాళ్ల చరిత్ర ఏంటి?

ABN , Publish Date - Feb 27 , 2024 | 05:33 PM

గగన్‌యాన్ మిషన్ (Gaganyaan Mission).. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ గురించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో - ISRO) మొదటి నుంచి కీలక విషయాలను ఒక్కొక్కటిగా పంచుకుంటూ వస్తోంది. కానీ.. ఇందులో భాగమయ్యే వ్యోమగాములు ఎవరనే విషయాన్ని మాత్రం మిస్టరీగానే ఉంచింది. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత ఈ మిస్టరీకి తెరదించుతూ.. నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించారు.

Gaganyaan Mission: ఆ నలుగురు వ్యోమగాములు ఎవరు? వాళ్ల చరిత్ర ఏంటి?

గగన్‌యాన్ మిషన్ (Gaganyaan Mission).. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ గురించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో - ISRO) మొదటి నుంచి కీలక విషయాలను ఒక్కొక్కటిగా పంచుకుంటూ వస్తోంది. కానీ.. ఇందులో భాగమయ్యే వ్యోమగాములు ఎవరనే విషయాన్ని మాత్రం మిస్టరీగానే ఉంచింది. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత ఈ మిస్టరీకి తెరదించుతూ.. నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో (Vikram Sarabhai Space Centre) గ్రూప్ కెప్టెన్స్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా గగన్‌యాన్ మిషన్‌లో భాగం అవుతారని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రకటించారు. దీంతో.. ఈ నలుగురు ఎవరు? వాళ్ల చరిత్ర ఏంటి? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పదండి.. వారి వివరాలేంటో ఈ వార్తలో తెలుసుకుందాం.


* గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్ (Group Captain Ajit Krishnan): 1982 ఏప్రిల్ 19వ తేదీన తమిళనాడులోని చెన్నైలో అజిత్ జన్మించారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రాష్ట్రపతి గోల్డ్ మెడల్, సోర్డ్ ఆఫ్ ఆనర్ అందుకున్నారు. వెల్లింగ్‌టన్‌లోని డీఎస్ఎస్‌సీ పూర్వ విద్యార్థి అయిన ఆయన.. 2003 జూన్ 21వ తేదీన IAF ఫైటర్ స్ట్రీమ్‌లో నియమించబడ్డారు. ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ అయిన ఆయనకు టెస్ట్ పైలట్‌గా దాదాపు 2900 గంటల అనుభవం ఉంది. Su-30 MKI, MiG-21, MiG-21, Mig-29, జాగ్వార్, డోర్నియర్, An-32 మొదలైన వివిధ రకాల ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడిపారు.

* గ్రూప్ కెప్టన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ (Group Captain Prasanth Balakrishnan Nair): 1967 ఆగస్టు 26వ తేదీన కేరళలోని తిరువాజియాడ్‌లో ప్రశాంత్ జన్మించారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సోర్డ్ ఆఫ్ ఆనర్‌ను అందుకున్న ఆయన.. 1998 డిసెంబర్ 19వ తేదీన IAF ఫైటర్ స్ట్రీమ్‌లో నియమించబడ్డారు. క్యాట్-ఏ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ అయిన ఆయనకు టెస్ట్ పైలట్‌గా 3000 గంటల అనుభవం ఉంది. Su-30 MKI, MiG-21, MiG-29, హాక్, డోర్నియర్, An-32 వంటి ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎగురవేశారు. ఒక ప్రీమియర్ ఫైటర్ Su-30 Sqnకి ఆయన నాయకత్వం వహించారు.

* గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ (Group Captain Angad Pratap): 1982 జులై 17వ తేదీన ప్రయాగ్‌రాజ్‌లో అంగద్ జన్మించారు. ఎన్డీఏ పూర్వి విద్యార్థి అయిన ఆయన.. 2004 డిసెంబర్ 18వ తేదీన IAF ఫైటర్ స్ట్రీమ్‌లో నియమించబడ్డారు. ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ అయిన అంగద్‌కు టెస్ట్ పైలట్‌గా దాదాపు 2000 గంటల అనుభవం ఉంది. ఆయన Su-30 MKI, MiG-21, MiG-29, జాగ్వార్, హాక్, డోర్నియర్, An-32 వంటి వివిధ రకాల ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎగరవేశారు.

* వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా (Wing Commander Shubhanshu Shukla): 1985 అక్టోబర్ 10వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో శుభాంశు జన్మించారు. ఎన్డీఏ పూర్వ విద్యార్థి అయిన ఆయన IAF ఫైటర్ స్ట్రీమ్‌లో 2006 జూన్ 17వ తేదీన నియమించబడ్డారు. ఫైటర్ కంబాట్ లీడర్ అయిన శుభాంశుకు టెస్ట్ పైలట్‌గా సుమారు 2000 గంటల అనుభవం ఉంది. Su-30 MKI, MiG-21, MiG-29, జాగ్వార్, హాక్, డోర్నియర్, An-32 మొదలైన వివిధ రకాల ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎగురవేశారు.

Updated Date - Feb 27 , 2024 | 05:33 PM