Home Minister: ముగ్గురు ఉపముఖ్యమంత్రుల కథనాలు ఊహాగానాలే..
ABN , Publish Date - Jan 07 , 2024 | 01:25 PM
రాష్ట్రంలో ముగ్గురికి ఉపముఖ్యమంత్రి పదవులను సృష్టించాలన్న ప్రధాన డిమాండ్‌తో సీనియర్ మంత్రులు రహస్యంగా సమాలోచనలు జరిపారన్న కథనాలు కేవలం ఊహగానాలేనని హోంశాఖ మంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్(Home Minister Dr. G. Parameshwar) స్పష్టం చేశారు.
- హోంశాఖ మంత్రి పరమేశ్వర్
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ముగ్గురికి ఉపముఖ్యమంత్రి పదవులను సృష్టించాలన్న ప్రధాన డిమాండ్‌తో సీనియర్ మంత్రులు రహస్యంగా సమాలోచనలు జరిపారన్న కథనాలు కేవలం ఊహగానాలేనని హోంశాఖ మంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్(Home Minister Dr. G. Parameshwar) స్పష్టం చేశారు. నగరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సహచర మంత్రులైన మహదేవప్ప, సతీశ్ జార్కిహొళితో తాను జరిపిన సమావేశం కేవలం ఉభయకుశలోపరి కోసమేనని తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు చర్చకు రాలేదన్నారు. మంత్రి రాజణ్ణ కూడా ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్న సంగతిని మీడియా ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఉపముఖ్యమంత్రి పదవుల విషయంలో తుది నిర్ణయం అధిష్టానం పెద్దలదే అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కోలారు నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా తనను ఎవరూ కోరలేదని తెలిపారు. ఒకవేళ అధిష్టానం పెద్దలు సూచిస్తే ఆలోచిస్తానని అన్నారు. బెంగళూరు కస్తూర్బా రోడ్డులోని విశ్వేశ్వరయ్య మ్యూజియంను బాంబులతో పేల్చివేస్తామని ఇ-మెయిల్ రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారని వివరించారు. ముందు జాగ్రత్తగా మ్యూజియం వద్ద భద్రతను ఏర్పాటు చేశామన్నారు.