Share News

నదుల దురాక్రమణను ఎలా అరికడుతున్నారు?

ABN , Publish Date - Oct 15 , 2024 | 03:05 AM

దేశంలోని నదీ పరివాహక ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న దురాక్రమణలు, అక్రమ నిర్మాణాలతో నదుల పర్యావరణ వ్యవస్థకు నష్టం జరుగుతుండడంతోపాటు తరచూ వరదలు సంభవిస్తుండడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది.

నదుల దురాక్రమణను ఎలా అరికడుతున్నారు?

  • పర్యావరణ క్షీణత నుంచి కాపాడేందుకు చర్యలేంటి?కేంద్ర సంస్థలకు సుప్రీం నోటీసు

  • కేంద్ర సంస్థలకు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): దేశంలోని నదీ పరివాహక ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న దురాక్రమణలు, అక్రమ నిర్మాణాలతో నదుల పర్యావరణ వ్యవస్థకు నష్టం జరుగుతుండడంతోపాటు తరచూ వరదలు సంభవిస్తుండడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ ఆక్రమణలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖ, భూశాస్త్ర విభాగం, జలసంఘం, కాలుష్య నియంత్రణ మండలి తదితర కేంద్ర సంస్థలకు నోటీసులు జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా పెరిగిపోవడం.. పర్యావరణం, జీవావరణం, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి అశోక్‌కుమార్‌ రాఘవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ నోటీసులు జారీ చేసింది. కాగా, అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాల వల్ల భారీ ఉత్పాతాలు, తరుచూ వరదలు సంభవిస్తున్నాయని.

కీలకమైన మౌలిక సదుపాయాలకు తీవ్రనష్టం వాటిల్లుతోందని పిటిషనర్‌ తెలిపారు. 1986లో ఆమోదించిన పర్యావరణ (పరిరక్షణ) చట్టం కింద ఈ అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవడం కేంద్ర పర్యావరణ అటవీశాఖ కీలక బాధ్యతగా ఆయన పేర్కొన్నారు. 2015 నుంచి నదుల పరిరక్షణ జోన్‌ లేదా నదుల నియంత్రణ జోన్‌ను నోటిఫై చేయకుండా జాప్యం చేస్తున్నారని తెలిపారు. నదుల అక్రమ ఆక్రమణల వల్ల భూగర్భ జలాలు కూడా ఇంకిపోతున్నాయని, నీటి కొరతకు కూడా దారి తీస్తుందని, దీంతో దేశంలో నీటి భద్రతకు ముప్పు ఏర్పడుతుందని పిటిషన్‌లో వివరించారు.


నదులను కాపాడేందుకు కఠినమైన నిబంధలను రూపొందించాలని, నదుల పరిరక్షణ జోన్‌పై వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేసేలా చూడాలని సుప్రీంకోర్టును కోరారు. దీంతో పర్యావరణ క్షీణత నుంచి దేశంలోని నదులను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించాలంటూ నోటీసుల్లో సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా, తెలంగాణలో నదుల పరిక్షణకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించడం ప్రాదాన్యం సంతరించుకుంది. మరోవైపు, కరోనా వ్యాక్సిన్‌ ప్రతికూల ప్రభావాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. వ్యాక్సిన్‌ కారణంగా రక్తం గడ్డకట్టడం వంటి ప్రతికూల ప్రభావాలు కనిపించాయని పేర్కొంటూ ప్రియా మిశ్ర, మరికొందరు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

Updated Date - Oct 15 , 2024 | 03:14 AM