Modi 3.0 Govt Formation: 3 దశాబ్దాల ఎన్డీఏ.. సక్సెస్‌ఫుల్ అలయన్స్
ABN , Publish Date - Jun 07 , 2024 | 01:18 PM
లక్షలాది మంది కార్యకర్తలు రాత్రింబవళ్లు కష్టపడటంతో ఎన్డీఏ కూటమికి భారీ మెజార్టీ సాధించిందని ప్రధాని మోదీ అభిప్రాయ పడ్డారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలో మోదీ మాట్లాడారు.
ఢిల్లీ: లక్షలాది మంది కార్యకర్తలు రాత్రింబవళ్లు కష్టపడటంతో ఎన్డీఏ కూటమికి భారీ మెజార్టీ సాధించిందని ప్రధాని మోదీ (PM Modi) అభిప్రాయ పడ్డారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలో మోదీ మాట్లాడారు. కూటమికి మద్దతు తెలిపిన పార్టీలు, అధినేతలు, ఎంపీలకు మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మోదీ ప్రశంసలు కురిపించారు. ఇక్కడ కూర్చున్నాడు చూడండి.. ఇతను పవన్ కల్యాణ్ కాదు తుఫాన్ అని సంబోధించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు అఖండ విజయం అందజేశారని గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కల్యాణ్ చారిత్రాత్మక విజయం సాధించారని గుర్తుచేశారు.
గురుతర బాధ్యత
‘కూటమిలోని నేతలకు తనపై ఆపార గౌరవం ఉంది. ఎన్డీఏ కూటమి వరసగా మూడోసారి అధికారం చేపట్టబోతుంది. మీరంతా కలిసి ఏకగ్రీవంగా తనను నాయకుడిగా ఎన్నుకున్నారు. దీంతో నా భుజాలపై మరో కొత్త బాధ్యత ఉంచారు. అందుకు నేను కృతజ్ఞుడిని. 2019లో ఇదే భవనంలో మీరంతా కలిసి నన్ను అధినేతగా ఎన్నుకున్నారు. ఇప్పుడు మరోసారి గురుతర బాధ్యత అప్పగించారు. ఆ బంధం మరింత బలపడి గట్టి పునాది ఏర్పడింది. ఇది తనకు అతి పెద్ద ఆస్తి అవుతుంది అని’ మోదీ భావొద్వేగానికి గురయ్యారు.
22 రాష్ట్రాల్లో పాలన
‘2019లో నేను ఈ సభలో మాట్లాడుతున్నప్పుడు, మీరంతా నాయకుడిగా ఎన్నుకున్నారు, ఆ సమయంలో నమ్మకం అనే ఒక విషయాన్ని నొక్కి చెప్పాను. ఈ రోజు మీరు నాకు ఈ బాధ్యత ఇస్తున్నారంటే మన మధ్య నమ్మకం అనే వారధి బలంగా ఉందని అర్థం. ఈ బంధం నమ్మకం అనే బలమైన పునాదిపై ఉంది, ఇది అతిపెద్ద ఆస్తి. దీనిని కొందరు అంగీకరించక పోవచ్చు. ఎన్డీఏ మాత్రం రుజువు చేసింది. దేశంలో 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మేం అన్ని మతాలు ఒక్కటే అని విశ్వసిస్తాం. దేశంలో గిరిజనులు ఎక్కువ ఉన్న 10 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి 7 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. గోవా, ఈశాన్య రాష్ట్రాల్లో.. క్రైస్తవులు ఎక్కువగా ఉన్న చోట పరిపాలన అందించే అవకాశం తమకు కలిగింది అని’ మోదీ వివరించారు.
ఇవే టార్గెట్
‘కూటమిలో ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండటం చాలా ముఖ్యం. సుపరిపాలన, అభివృద్ధి, పౌరుల జీవితాల్లో మార్పుల అంశంపై దృష్టిసారిస్తాం. మరో పదేళ్లు సుపరిపాలన అందజేస్తాం. కూటమిలోని పార్టీలకు దేశ హితమే ముఖ్యం, అధికారం కాదు. ప్రజల ప్రయోజనాల కోసమే పాటు పడతాం. పరిపాలనలో ఎన్డీఏ మూడు దశాబ్దాలను పూర్తి చేసుకోబోతుంది. ఇది చిన్న విషయం ఎంత మాత్రం కాదు. ఎన్డీఏ కూటమి అనేది అత్యంత విజయవంతమైన భాగస్వామ పక్షం అని’ ప్రధాని మోదీ అభిప్రాయ పడ్డారు.