Islamabad: భారత్ సూపర్‌గా ఎదుగుతుంటే పాక్ అడుక్కుంటోంది!
ABN , Publish Date - May 01 , 2024 | 05:45 AM
సూపర్ పవర్‌గా ఎదగాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంటే పాకిస్థాన్ నిధుల కోసం అడుక్కుంటోందని విపక్ష నేత మౌలానా ఫజులుర్ రహ్మాన్ వ్యాఖ్యానించారు.
ఆ దేశ పార్లమెంటులో విపక్ష నేత వ్యాఖ్య
ఇస్లామాబాద్, ఏప్రిల్ 30: సూపర్ పవర్‌గా ఎదగాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంటే పాకిస్థాన్ నిధుల కోసం అడుక్కుంటోందని విపక్ష నేత మౌలానా ఫజులుర్ రహ్మాన్ వ్యాఖ్యానించారు. జమాత్ ఉలేమా ఎ ఇస్లాం (ఫజల్) పార్టీ నాయకుడైన ఆయన మంగళవారం పార్లమెంటు ప్రారంభ సమావేశంలో ప్రసంగించారు.
దేశ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ ‘‘1947లో భారత్, పాకిస్థాన్‌లకు ఒకేసారి స్వాతంత్య్రం వచ్చింది. ఇవాళ భారత దేశం ప్రపంచంలోనే సూపర్ పవర్‌గా ఎదగాలని ప్రయత్నాలు చేస్తోంది. మనం మాత్రం దివాళా పరిస్థితి నుంచి బయటపడేందుకు పోరాటం చేస్తున్నాం. ఇంతగా అంతరం ఉండడానికి కారకులు ఎవరు?’’ అని ఆయన ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఎన్నికల తీరుపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఇవేమి ఎన్నికలు? ఓడిన వారు అసంతృప్తిలో ఉండడం.. గెలిచిన వారిలోనూ సంతోషం కనిపించకపోవడం..ఇదేమి పరిస్థితి?’’ అని అన్నారు.