లండన్‌లో 22 టన్నుల చీజ్ దోపిడీ
ABN , Publish Date - Oct 30 , 2024 | 04:06 AM
పక్కా ప్లాన్ వేసిన కొంతమంది కేటుగాళ్లు లండన్‌లోని ఓ ప్రముఖ డెయిరీ నుంచి ఏకంగా 22 టన్నుల చీజ్‌ను దోపిడీ చేశారు.
డిస్ట్రిబ్యూటర్లమని చెప్పి రూ. 3 కోట్ల సరుకు స్వాహా
లండన్, అక్టోబరు 29: పక్కా ప్లాన్ వేసిన కొంతమంది కేటుగాళ్లు లండన్‌లోని ఓ ప్రముఖ డెయిరీ నుంచి ఏకంగా 22 టన్నుల చీజ్‌ను దోపిడీ చేశారు. హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్లమని, పేరు మోసిన కంపెనీకి పంపిణీ చేస్తామని చెప్పడంతో వాళ్లను పూర్తిగా నమ్మిన సదరు డెయిరీ... కష్టపడి తయారుచేసిన రూ. 3 కోట్ల విలువైన సరుకును పంపించింది. తీరా చూస్తే మోసపోయినట్లు తెలుసుకుంది. ఆలస్యంగా వెలగులోకి వచ్చిన ఈ జున్ను దోపిడీ ఘటన లండన్‌లో కలకలం రేపుతోంది. నగరంలోని నీల్స్ యార్డ్ డెయిరీ... చెద్దార్ చీజ్ తయారీలో పేరుగాంచింది. పలు రకాల చీజ్‌లు తయారుచేయడంలో దానికంటూ ఓ ప్రత్యేకత ఉంది. అందుకే అక్కడి చీజ్ కోసం జనం ఎగబడతారు. అలాంటి ప్రముఖ దుకాణాన్ని మోసగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. తాము హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్లమని, ఓ పెద్ద పేరున్న ఫ్రెంచ్ రిటైలర్‌కు పంపిణీ చేసేందుకు గాను 22 టన్నుల చీజ్ అవసరముందని ఆర్డర్ ఇచ్చారు. వాళ్ల కట్టుకథనంతా నమ్మిన నీల్స్‌యార్డ్... సరుకును సదరు పంపిణీదారుకు అప్పగించింది. కానీ అది గమ్యస్థానానికి చేరలేదు. దాంతో మోసం బయటపడింది. ఆ దేశానికి చెందిన ప్రముఖ చెఫ్... జెమీ అలీవర్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన దీన్ని ‘అతి పెద్ద చీజ్ దోపిడీగా అభివర్ణించారు.