సిద్ధాంత పోరులో ‘ఇండియా’దే విజయం
ABN , Publish Date - Apr 13 , 2024 | 03:22 AM
మతతత్వవాద పార్టీలకు, లౌకికవాద పార్టీలకు మధ్య సైద్ధాంతికపరమైన పోరే ఈ లోక్‌సభ ఎన్నికలని, ఇందులో ఇండియా కూటమి....
తిరునల్వేలి ప్రచార సభలో రాహుల్
చెన్నై, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): మతతత్వవాద పార్టీలకు, లౌకికవాద పార్టీలకు మధ్య సైద్ధాంతికపరమైన పోరే ఈ లోక్‌సభ ఎన్నికలని, ఇందులో ఇండియా కూటమి ఘనవిజయం సాధిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. పెరియార్, సామాజిక న్యాయానికి - ప్రధాని మోదీ, ఆర్‌ఎ్‌సఎస్ సిద్ధాంతాలకు మధ్య పోరాటంగా ఈ ఎన్నికలను రాహుల్ అభివర్ణించారు. తిరునల్వేలి పార్లమెంటు నియోజకవర్గంలో శుక్రవారం సాయంత్రం ఇండియా కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఏర్పాటు చేసిన సభలో రాహుల్ ప్రసంగించారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అదానీ, అంబానీ వంటి శ్రీమంతులకు దేశంలోని ప్రధాన హార్బర్లు, విండ్ మిల్లులు, సోలార్ ప్లాంట్లు అప్పగించడం వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఉపాధి అవకాశాలు కోల్పోయారని రాహుల్ తెలిపారు. రైతుల రుణాలను మాఫీ చేయని మోదీ, తనకు అనుకూలంగా ఉన్న ప్రైవేటు సంస్థల యజమానులకు సంబంధించిన రూ.14 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని ఆరోపించారు. జీఎ్‌సటీ వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు మూతపడ్డాయని వ్యాఖ్యానించారు. సీబీఐ, ఎన్‌ఏఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ తన జేబు సంస్థలుగా మార్చి ప్రత్యర్ధుల గొంతు నొక్కేస్తోందన్నారు. నీట్ పరీక్ష పేదలకు వ్యతిరేకమైనదని, ఈ వ్యవహారాన్ని ఆయా రాష్ట్రప్రభుత్వాల నిర్ణయానికే వదిలేయడమే ఇండియా కూటమి లక్ష్యమన్నారు.