MEA: బంగ్లాలో హిందూ ఆలయాలపై దాడులు.. ఎంఈఏ తీవ్ర ఆక్షేపణ
ABN , Publish Date - Oct 12 , 2024 | 05:09 PM
బంగ్లాలో ఆలయాలు, దేవీదేవతలను ధ్వంసం చేయడం, అపవిత్రం చేయడం ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయంటూ ఎంఈఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. అది కూడా పండుగ సీజన్లలో ఇలాంటివి చోటుచేసుకుంటుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నట్టు తెలిపింది.
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లోని దుర్గా పూజా మండపం, హిందూ ఆలయాలపై దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఢాకాలోని తాంటిబజార్‌లో పూజా మండపంపై దాడి, సత్కారాలోని ప్రఖ్యాత జోషోరేశ్వరి ఆలయంలో కాళీమాత కిరీటం చోరీ కావడం తమ దృష్టికి వచ్చాయని, ఇవి గర్హనీయమైన చర్యలని కేంద్ర విదేశాంగ శాఖ (ఎంఈఏ) శనివారంనాడు ఒక ప్రకటనలో పేర్కొంది.
Rajnath singh: జవాన్లతో కలిసి ఆయుధపూజ చేసిన రాజ్‌నాథ్ సింగ్
బంగ్లాలో ఆలయాలు, దేవీదేవతలను ధ్వంసం చేయడం, అపవిత్రం చేయడం ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయంటూ ఎంఈఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా పండుగ సీజన్లలో ఇలాంటివి చోటుచేసుకుంటుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నట్టు తెలిపింది. ''హిందువులు, మైనారిటీలు, వారి ఆరాధనా స్థలాలకు ముఖ్యంగా పండుగ సమయాల్లో తగిన భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం'' అని ఆ ప్రకటనలో ఎంఈఏ పేర్కొంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ 2021లో బంగ్లాదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా జేషోరేశ్వరి దేవి శక్తిపీఠాన్ని సందర్శించారు. వెండితో చేసిన బంగారం పూత కలిగిన కిరీటాన్ని అమ్మవారికి కానుకగా అందజేశారు. గత గురువారం దేవాలయంలో ఎప్పటిలాగే అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆ సమయంలో అమ్మవారి విగ్రహానికి కిరీటం లేనట్లు వారు గుర్తించారు. ఆ మరుసటి రోజు రాత్రి ఢాకాలోని తాంటిబజార్ ఏరియాలోని ఒక ఆలయంపై అగంతకులు ఫైర్‌బాంబ్ విసిరారు. ఈ ఘటనలో ఎవరూ మృతి చెందనప్పటికీ ఐదుగురు గాయపడ్డారు.
కాగా, బంగ్లాలో దుర్గా పూజోత్సవాలకు ముందు గత నెలలో ఇస్లామిక్ సంస్థలు దాడులకు పాల్పడతామంటూ బెదరించింది. దీంతో తాత్కాలిక ప్రభుత్వ రెలిజియస్ ఎఫైర్స్ అడ్వయిజర్ ఏఎఫ్ఎం ఖలీద్ హుస్సేన్ ఇస్లామిక్ ఉగ్ర సంస్థలకు హెచ్చరికలు చేశారు. హిందూ పండుగల్లో ఆరాధనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Read More National News and Latest Telugu News
ఇది కూడా చదవండి..