Delhi: సౌర విద్యుత్‌లో జపాన్‌ను దాటేసిన భారత్..
ABN , Publish Date - May 09 , 2024 | 05:04 AM
సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో భారత్ గణనీయ వృద్ధి సాధించింది.
న్యూఢిల్లీ, మే 8: సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో భారత్ గణనీయ వృద్ధి సాధించింది. ప్రముఖ గ్లోబల్ ఎనర్జీ సంస్థ ఎంబర్ నివేదిక ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సోలార్ పవర్‌ను ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో జపాన్ ను అధిగమించి మూడో స్థానానికి చేరుకుంది. 2015లో భారత్ తొమ్మిదో స్థానంలో ఉంది. ఎంబర్ బుధవారం విడుదల చేసిన గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ-2024లో ఈ వివరాలు వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా 225 దేశాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. 2023లో చైనా 156 టెరావాట్ హవర్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయగా, అమెరికా 33, భారత్ 18 టెరావాట్ హవర్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయి. సోలార్ విద్యుత్ ఉత్పత్తి అనూహ్యంగా పెరుగుతోందని ఎంబర్ ఆసియా ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆదిత్య లొల్లా చెప్పారు. 2015తో పోలిస్తే ప్రపంచ సౌర విద్యుత్ ఉత్పత్తి 2023లో 6 రెట్లు పెరిగింది. ఇదే సమయంలో భారత్‌లో ఇది 17 రెట్లు పెరిగింది. 2015 లో భారత విద్యుత్ ఉత్పత్తిలో సౌరశక్తి వాటా 0.5 శాతం ఉండగా.. 2023లో అది 5.8 శాతానికి ఎగబాకింది.