Share News

మరోసారి ‘మిలియన్‌ వీసా’ రికార్డు

ABN , Publish Date - Dec 28 , 2024 | 06:05 AM

రికార్డు స్థాయి సందర్శకుల వీసాలు సహా మొత్తం పది లక్షలకుపైగా వలసేతర వీసాలను భారతీయులకు వరుసగా రెండో ఏడాది జారీ చేసినట్టు భారత్‌లోని అమెరికా ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది. చదువుల కోసం తమ విద్యార్థులను అమెరికాకు పంపిన దేశాల వరసలో భారత్‌ టాప్‌లో నిలిచిందని తెలిపింది.

మరోసారి ‘మిలియన్‌ వీసా’ రికార్డు

భారతీయులకు పదిలక్షలకుపైగా వలసేతర వీసాలు

వరుసగా రెండో ఏడాదీ టాప్‌లో భారత్‌

విదేశీ విద్యార్థుల ర్యాంకింగ్‌లో అగ్రస్థానం

భారత్‌లోని అమెరికా ఎంబసీ వెల్లడి

హెచ్‌-1బీ వీసాల రెన్యూవల్‌ ఇక తేలిక

న్యూఢిల్లీ, డిసెంబరు 27 : రికార్డు స్థాయి సందర్శకుల వీసాలు సహా మొత్తం పది లక్షలకుపైగా వలసేతర వీసాలను భారతీయులకు వరుసగా రెండో ఏడాది జారీ చేసినట్టు భారత్‌లోని అమెరికా ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది. చదువుల కోసం తమ విద్యార్థులను అమెరికాకు పంపిన దేశాల వరసలో భారత్‌ టాప్‌లో నిలిచిందని తెలిపింది. ఈ ఏడాది 3,31,000 మందిని మనదేశం పంపినట్టు పేర్కొంది. 2008/2009 తర్వాత ఈ స్థాయిలో వేరే దేశం నుంచి అమెరికాకు చదువుల కోసం రావడం ఇదే తొలిసారి. అంతేకాదు.. అంతర్జాతీయంగా అత్యధికంగా గ్రాడ్యుయేట్లను వరుసగా రెండో ఏడాది కూడా అగ్రదేశానికి పంపిన ఘనతను కూడా భారత్‌ సొంతం చేసుకుంది. ఇప్పుడు అక్కడ రెండు లక్షల మంది (19 శాతం) గ్రాడ్యుయేట్లు మనదేశం నుంచి ఉన్నారు. విద్య తర్వాత పర్యాటకం, వ్యాపార అవసరాల కోసం అమెరికాను భారతీయులు సందర్శిస్తున్నారని ఈ సంస్థ తెలిపింది. అమెరికాకు భారత్‌ నుంచి సందర్శకుల సంఖ్య గత నాలుగేళ్లలోనే ఐదు రెట్లు పెరిగి.. 20 లక్షలమందికి చేరిందని వివరించింది. గత ఏడాది తొలి పదకొండు నెలలతో పోల్చితే.. ఈ ఏడాది అదే కాలానికి పెరుగుదల 26 శాతమని తెలిపింది. ఇప్పటికే యాభై లక్షలమంది వలసేతర వీసాల మీద అమెరికాలో ఉన్నారని, ప్రతి రోజూ ఈ వీసాలను వేలల్లో జారీ చేస్తున్నామని తెలిపింది. మరోవైపు.. హెచ్‌-1బీ వీసాలను అమెరికాలోనే పునరుద్ధరించే ఆలోచనతో చేపట్టిన పైలట్‌ విధానం మంచి ఫలితాలను ఇచ్చిందని ఆ దేశ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీనివల్ల ప్రత్యేక వృత్తి నిపుణులను అత్యధికంగా అమెరికాకు అందిస్తున్న భారత్‌ ఎక్కువ లబ్ధి పొందనుంది. సాధారణంగా హెచ్‌-1బీ వీసా గడువు ముగియగానే మనవాళ్లు భారత్‌కు తిరిగి వచ్చి రెన్యువల్‌ (స్టాంపింగ్‌) చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన కొత్త విధానం ప్రకారం.. ఇకపై వీరు అమెరికాలోనే తమ వీసాలను రెన్యువల్‌ చేయించుకునే వెసులుబాటు కలగనుంది.

Updated Date - Dec 28 , 2024 | 06:11 AM