Share News

Uttar Pradesh: వారసత్వం రసవత్తరం..

ABN , Publish Date - May 05 , 2024 | 03:41 AM

రసవత్తర రాజకీయానికి పేరుగాంచిన ఉత్తరప్రదేశ్‌లో మూడో దశలో ఆసక్తికర సమరం జరగనుంది. వారసత్వం, తిరుగుబాట్లు, చిరకాల విరోధుల మధ్య పోటాపోటీ నెలకొంది.

Uttar Pradesh: వారసత్వం  రసవత్తరం..

యూపీ మూడో దశలో 7న 10 సీట్లకు పోలింగ్‌

  • మూడుచోట్ల ములాయం కుటుంబసభ్యుల పోటీ

(సెంట్రల్‌ డెస్క్‌)

రసవత్తర రాజకీయానికి పేరుగాంచిన ఉత్తరప్రదేశ్‌లో మూడో దశలో ఆసక్తికర సమరం జరగనుంది. వారసత్వం, తిరుగుబాట్లు, చిరకాల విరోధుల మధ్య పోటాపోటీ నెలకొంది. ఈ నెల 7న మూడో దశలో యూపీలోని 10 సీట్లకు పోలింగ్‌ జరగనుంది. వీటిలో 3 స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు, దివంగత ములాయంసింగ్‌ యాదవ్‌ కుటుం బ సభ్యులే బరిలో ఉన్నారు. గట్టి ప్రత్యర్థులతో తలపడుతున్న వీరంతా విజయం సాధించడం ద్వారా తమ పెద్దల పేరు నిలబెట్టాలని భావిస్తున్నారు.


ములాయం ఇంటినుంచి మరో వారసుడొచ్చాడు

ఈ ఎన్నికల్లో ములాయం కుటుంబం నుంచి మరో నాయకుడు ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు. ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ తొలుత తన బాబాయ్‌, జశ్వంత్‌నగర్‌ ఎమ్మెల్యే శివపాల్‌సింగ్‌ యాదవ్‌కు బదౌన్‌ టికెటిచ్చారు. కానీ, కుమారుడు ఆదిత్య యాదవ్‌ రాజకీయ ప్రవేశానికి ఇదే సరై న సమయమని భావించి ఆయన వెనక్కుతగ్గారు. ఇప్పుడు ఆదిత్య తరఫున అంతా తానై ప్రచారం చేస్తున్నారు. ఇక అఖిలేశ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ తమ కుటుంబ కంచుకోట మెయిన్‌పురి నుంచి మళ్లీ బరిలో నిలిచారు. ఇక్కడి నుంచి ఐదుసార్లు గెలిచిన ములాయం 2022లో చనిపోయారు. తర్వాత ఉప ఎన్నికలో డింపుల్‌ గెలిచారు. ములా యం మరో సోదరుడు, ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్‌ యాదవ్‌ కుమారుడు అక్షయ్‌ ఫిరోజాబాద్‌ను వశం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సంభాల్‌లో ఎస్పీ కుందర్కి నియోజకవర్గ ఎమ్మెల్యే జియాఉర్‌ రెహ్మాన్‌ బార్క్‌ పోటీ చేస్తున్నారు. ఈయన ఇటీవల మృతిచెందిన ఎంపీ షఫీఖుర్‌ రెహ్మాన్‌ బార్క్‌కు మనుమడు.


ఎటాలో కల్యాణ్‌సింగ్‌ కుమారుడికి..

యూపీ రాజకీయాలపై చెరగని ముద్రవేసిన మాజీ సీఎం కల్యాణ్‌సింగ్‌ కుమారుడు రాజ్‌వీర్‌సింగ్‌ను బీజేపీ ఎటా నుం చి నిలిపింది. ఫతేపూర్‌ సిక్రీలో కమలానికి తిరుగుబాటు తలనొప్పి తెస్తోంది. సిటింగ్‌ ఎంపీ రాజ్‌కుమార్‌ చహర్‌కు మరోసారి టికెట్‌ ఇచ్చింది. అయితే స్థానిక ఎమ్మెల్యే చౌదరి బాబూలాల్‌ కుమారుడు రామేశ్వర్‌ స్వతంత్రుడిగా పోటీకి దిగారు. 2014లో బాబూలాల్‌ ఎంపీగా గెలిచినా, 2019లో టికెట్‌ ఇవ్వలేదు. ఎంతచెప్పినా వెనక్కు తగ్గకపోవడంతో రామేశ్వర్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. బరేలీ నుంచి 8సార్లు గెలిచిన కేంద్ర మాజీ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ను తప్పించిన బీజేపీ రాష్ట్ర మాజీ మంత్రి ఛత్రపాల్‌ గంగ్వార్‌ను పోటీకి దించింది.


హథ్ర్‌సలో ఈసారి తీర్పు ఏమిటో?

2020లో హథ్ర్‌సలో దళిత యు వతిపై సామూహిక అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గమైన హథ్ర్‌సలో 2019లో బీజేపీ నుంచి రాజ్‌వీర్‌ సింగ్‌ డిల్లర్‌ గెలిచారు. ఈసారి ఆయనను కాకుండా అనూ ప్‌ ప్రధాన్‌ను నిలిపింది. ఎస్పీ.. రామ్‌జీలాల్‌ సుమన్‌ బదులు జస్వీర్‌ వాల్మీకీని పోటీకి దింపింది.

3వ దశలో పోలింగ్‌ జరిగే నియోజకవర్గాలు: సంభాల్‌, హథ్రస్‌, ఆగ్రా, ఫతేపూర్‌ సిక్రీ, ఫిరోజాబాద్‌, మెయిన్‌పురి, ఎటా, బదౌన్‌, ఓన్లా.


డిగ్గీ రాజా గట్టెక్కేనా?

సెంటిమెంట్‌ అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉమ్మడి ఏపీ కాంగ్రెస్‌ మాజీ ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో గెలుపునకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకప్పటి కంచుకోట అయిన ఈ స్థానంలో 77 ఏళ్ల దిగ్విజయ్‌.. బీజేపీ సిటింగ్‌ ఎంపీ రోడ్మల్‌నగర్‌తో తలపడుతున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ రోడ్మల్‌ ఇక్కడి నుంచి గెలుపొందారు. రాజ్‌గఢ్‌ లోక్‌సభ పరిధిలో 8 అసెంబ్లీ సీట్లుంటే.. 6 చోట్ల బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. 2003లో అధికారం కోల్పోయిన అనంతరం 16ఏళ్లు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు దిగ్విజయ్‌. 2019లో భోపాల్‌ నుంచి పోటీ చేసి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ చేతిలో పరాజయం పాలయ్యారు.


ఇప్పుడు రాజ్‌గఢ్‌ నుంచి బరిలో దిగారు. ఇవే తనకు చివరి ఎన్నికలంటూ ప్రజల్లో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ‘‘అభ్యర్థిని కాదు.. మోదీని చూసి ఓటేయమని కోరుతున్నారు. ఆయన వచ్చి మీ సమస్యలు తీరుస్తా రా? నన్ను గెలిపిస్తే అందుబాటులో ఉంటూ మార్పు చూపిస్తా’’అని కోరుతున్నారు. 2018లో ఎన్నికైన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చివేసిన కుట్రను వివరిస్తూ, ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దిగ్విజయ్‌ వెంట యువకులతో కూడిన వృత్తి నిపుణుల బృందం ఉంటోంది. వీరు కాల్‌ సెంటర్‌ నిర్వహిస్తూ రాజ్‌గఢ్‌లోని యువతతో అనుసంధానమ వుతున్నారు. దిగ్విజయ్‌కు మద్దతుగా ఆయన భార్య, మాజీ జర్నలిస్టు అమృతా సింగ్‌ ప్రచారం చేస్తున్నారు.


మూడో దశలో చౌహాన్‌, సింధియా, అధిర్‌

రాజ్‌గఢ్‌కు మూడో దశలో పోలింగ్‌ జరగనుంది. దిగ్విజయ్‌తోపాటు ఈ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ప్రముఖుల్లో బీజేపీ నుంచి మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌-విదిశ, కేంద్రమంత్రులు జ్యోతిరాదిత్య సింధియా-గుణ (మధ్యప్రదేశ్‌) ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో ప్రహ్లాద్‌ జోషి-ధార్వాడ్‌ (కర్ణాటక), పల్లవి డెంపో-దక్షిణ గోవా, లోక్‌సభలో కాంగ్రెస్‌ సభాపక్షనేత అధిర్‌ రంజన్‌-బహరంపూర్‌ (పశ్చిమ బెంగాల్‌), ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌-మెయిన్‌పురి (యూపీ) బరిలో ఉన్నారు.

Updated Date - May 05 , 2024 | 04:37 AM