Karnataka IPS: తొలిరోజే చెదిరిన కల.. పోస్టింగ్‌కు వెళ్తోన్న యువ ఐపీఎస్‌ను కబళించిన మృత్యువు
ABN , Publish Date - Dec 02 , 2024 | 03:40 PM
ఓ యువ ఐపీఎస్ కథ విషాదాంతంగా ముగిసింది. ఎన్నో ఏళ్ల కష్టానికి ప్రతిఫలం లభించే సమయంలో రోడ్డు ప్రమాదం ఆయన జీవితాన్ని తలకిందులు చేసింది. ఈ ప్రమాదంలో కర్నాటక రాష్ట్రం ఓ యువ అధికారిని కోల్పోయింది..
బెంగళూరు: దేశంలోనే అత్యుత్తమ సర్వీసులో భాగం కావాలన్న కల తొలిరోజే చెదిరిపోయింది. పోస్టింగ్ తీసుకున్న రోజే ఓ యువ ఐపీఎస్ అధికారి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. శిక్షణ పూర్తి చేసుకుని పోస్టింగ్ కోసం బయలుదేరిన ఆయనను మృత్యువు కబళించింది. కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
పేలిన పోలీస్ వాహనం..
చిన్న వయసులోనే ఐపీఎస్ సాధించిన హర్ష్ వర్ధన్(26) కర్ణాటక కేడర్ కు చెందిన 2023 బ్యాచ్ అధికారి. మధ్యప్రదేశ్ కు చెందిన ఆయన దేశానికి సేవ చేయాలన్న ఆశలను గుండెలనిండా నింపుకుని తొలిరోజు పోస్టింగ్ కోసం బయలుదేరారు. ఆయన ప్రయాణిస్తున్న పోలీస్ వాహనం మార్గమధ్యంలో టైరు పేలుడుకు గురికావడంతో ఘోర ప్రమాదం జరిగింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం ఓ ఇంటివైపు దూసుకెళ్లి పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. ఈ దుర్ఘటనలో హర్ష్ వర్ధన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆసుపత్రికి తరలించే క్రమంలో ఆయన మృతి చెందారు. డ్రైవర్ చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. ప్రమాద తీవ్రతకు వాహనం నుజ్జునుజ్జైంది.
సీఎం సంతాపం..
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఐపీఎస్ మృతికి సంతాపం ప్రకటించారు. ఎన్నో ఏండ్ల కష్టానికి ప్రతిఫలం లభించే సమయంలో ఈ విషాదం జరగడం బాధాకరం అని ఆయన అన్నారు. హర్ష్ వర్ధన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఆయన మృతికి పలువురు రాజకీయ నాయకులు, అధికారులు సైతం నివాళులు అర్పించారు. హర్ష్ వర్ధన్ ఇటీవల కర్ణాటక పోలీస్ అకాడమీలో నాలుగు వారాల శిక్షణను ఆయన పూర్తిచేసుకున్నారు. హోలెనరసిపూర్‌లో ప్రొబేషనరీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా డ్యూటీలో రిపోర్ట్ చేయడానికి హసన్‌కు వెళుతున్నట్లు పోలీసులు తెలిపారు.