Share News

Delhi: ఇనుప కవచాలు, జనపనార బస్తాలతో ఢిల్లీ సరిహద్దులో రైతులు.. ఎందుకంటే

ABN , Publish Date - Feb 20 , 2024 | 02:58 PM

తమ డిమాండ్లను పరిష్కరించలేదనే కారణంతో ఢిల్లీ సరిహద్దులో రైతుల పోరాటాలు(Farmers Protest) ఉద్ధృతం అయ్యే అవకాశం ఉంది. మూడు రకాల పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని పాత ఎంఎస్‌పీకి కొనుగోలు చేయాలన్న ప్రభుత్వం ఐదేళ్ల ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు బుధవారం తమ నిరసనలను పునఃప్రారంభించనున్నారు.

Delhi: ఇనుప కవచాలు, జనపనార బస్తాలతో ఢిల్లీ సరిహద్దులో రైతులు.. ఎందుకంటే

ఢిల్లీ: తమ డిమాండ్లను పరిష్కరించలేదనే కారణంతో ఢిల్లీ సరిహద్దులో రైతుల పోరాటాలు(Farmers Protest) ఉద్ధృతం అయ్యే అవకాశం ఉంది. మూడు రకాల పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని పాత ఎంఎస్‌పీకి కొనుగోలు చేయాలన్న ప్రభుత్వం ఐదేళ్ల ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు బుధవారం తమ నిరసనలను పునఃప్రారంభించనున్నారు.

ఈ తరుణంలో పోలీసులు మోహరించిన టియర్ గ్యాస్ షెల్స్‌ను ఎదుర్కొనేందుకు ఇనుప కవచాలు, జనపనార బస్తాలతో శంభు సరిహద్దులో - పంజాబ్, హరియాణా రైతులు మోహరించారు. పోలీసులు తమ పోరాటానికి అడ్డుతగులుతారని భావించిన రైతులు ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దేశ రాజధానిలో జర్నలిస్టులకు అధికారులు ఐడీ కార్డులు జారీ చేశారు. శాంతియుతంగా ఢిల్లీ వైపు పాదయాత్ర కొనసాగిస్తామని రైతులు చెబుతున్నారు.


"మాపై బలప్రయోగం చేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము శాంతియుతంగా నిరసన తెలియజేయాలనుకుంటున్నాం" అని రైతులు చెప్పారు. ప్రభుత్వం రెండు లేదా మూడు పంటలకు మాత్రమే కనీస మద్దతు ధరను వర్తింపజేయడం, మిగతా పంటలు పండిస్తున్న రైతులను పట్టించుకోకపోవడం సరైనది కాదు అని రైతు సంఘాల నేత సర్వన్ సింగ్ పందేర్ అన్నారు. 200 సంఘాల మద్దతుతో రైతులు ఫిబ్రవరి 13న ఢిల్లీలో పాదయాత్ర ప్రారంభించారు.

శంభు సరిహద్దు వద్ద గుమిగూడిన నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. మార్కెట్‌లోని అస్థిరతల నుంచి రైతులను రక్షించేందుకు ఉద్దేశించిన ఎంఎస్‌పీపై చట్టం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో రైతులు నిరసనలు తెలుపుతున్నారు. రుణమాఫీ, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని, రైతులు, రైతు కూలీలకు పెన్షన్‌ ఇవ్వాలని, గతంలో జరిగిన నిరసనలో తమపై పెట్టిన పోలీసు కేసులను ఉపసంహరించుకోవాలని, ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో మృతి చెందిన రైతులకు న్యాయం చేయాలని కర్షకులు కోరుతున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 20 , 2024 | 02:59 PM