Jharkhand: అనూహ్య పరిణామాలతో సీఎం రాజీనామా.. గవర్నర్‌ను కలిసిన హేమంత్ సోరెన్
ABN , Publish Date - Jul 03 , 2024 | 08:45 PM
జార్ఖాండ్ రాజకీయాల్లో బుధవారంనాడు అనూహ్య పరిణామాణాలు చోటుచేసుకున్నాయి. జార్ఖాండ్ ముఖ్యమంత్రి పదవికి చంపాయి సోరెన్ రాజీనామా చేసారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు పంపారు. దీంతో మాజీ సీఎం హేమంత్ సోరెన్ తిరిగి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమం అయింది.
రాంచీ: జార్ఖాండ్ (Jharkhand) రాజకీయాల్లో బుధవారంనాడు అనూహ్య పరిణామాణాలు చోటుచేసుకున్నాయి. జార్ఖాండ్ ముఖ్యమంత్రి పదవికి చంపాయి సోరెన్ (Champai Soren) రాజీనామా చేసారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు పంపారు. దీంతో మాజీ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren) తిరిగి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమం అయింది. చంపాయి సోరెన్ రాజీనామా చేసిన కొద్ది సేపటికే హేమంత్ సోరెన్ జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్‌ను కలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను ఆయన కోరారు.
హేమంత్ సోరెన్‌ను మా నేతగా ఎన్నుకున్నాం..
కాగా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం చంపాయి సోరెన్ మీడియాతో మాట్లాడుతూ, కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి తాను బాధ్యతలు నిర్వహించానని చెప్పారు. హేమంత్ సోరెన్ తిరిగి రావడంతో కూటమి నేతగా హేమంత్ సోరెన్‌ను తామంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే తాను గవర్నర్‌కు రాజీనామా సమర్పించినట్టు చెప్పారు.
Hemant Soren: జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ మళ్లీ పగ్గాలు?
ఇదీ నేపథ్యం..
ల్యాండ్ స్కామ్‌లో హేమంత్ సోరెన్ ఈ ఏడాది జనవరి 31న అరెస్టయ్యారు. అరెస్టుకు ముందే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు. ఆ వెంటనే చంపాయి సోరెన్ సీఎంగా పగ్గాలు చేపట్టారు. సుమారు 5 నెలల పాటు జైలులో ఉన్న హేమంత్ సోరెన్‌కు జూన్ 28న జార్ఖాండ్ హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం చంపయి సోరెన్ నివాసంలో జేఎంఎం, కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సోరెన్‌ను జేఎంఎం లెజిస్లేచర్ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోరెన్ తిరిగి సీఎం పగ్గాలు చేపట్టాలని సమావేశంలో తీర్మానించారు. కాంగ్రెస్ జార్ఖాండ్ ఇన్‌చార్జి గులాం అహ్మద్ మీర్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్, హేమంత్ సోరెన్ సోదరుడు బసత్, భార్య కల్పన కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
గవర్నర్ నుంచి పిలుపు అందగానే...
కాగా, ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా సోరెన్ కోరడంతో గవర్నర్ నుంచి పిలుపు అందగానే సోరెన్ తిరిగి ప్రభుత్వ పగ్గాలు చేపడతారని జేఎంఎం వర్గాలు తెలిపాయి. దీంతో 2020 నవంబర్ 15న బీహార్ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా జార్ఖాండ్ ఏర్పడినప్పటి నుంచి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సోరెన్ పగ్గాలు చేపట్టడం ఇది మూడోసారి అవుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..