Share News

JMM Crisis: ఈడీ దాడులు, సీఎం నివాసంలో ఎమ్మెల్యేల సమావేశం.. ఈ పరిణామాలు దేనికి సంకేతం?

ABN , Publish Date - Jan 03 , 2024 | 07:14 PM

జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాయకత్వంలోని జేఎంఎం ప్రభుత్వం చిక్కుల్లో పడినట్టే కనిపిస్తోంది. పరిస్థితిపై చర్చించేందుకు అధికార జేఎంఎం సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం ఎమ్మెల్యేలు సీఎం నివాసంలో బుధవారం సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి పదవికి సోరెన్ రాజీనామా చేసి తన భార్య కల్పనా సోరెన్‌కు పగ్గాలు అప్పగించనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

JMM Crisis: ఈడీ దాడులు, సీఎం నివాసంలో ఎమ్మెల్యేల సమావేశం.. ఈ పరిణామాలు దేనికి సంకేతం?

రాంచీ: జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) నాయకత్వంలోని జేఎంఎం (JMM) ప్రభుత్వం చిక్కుల్లో పడినట్టే కనిపిస్తోంది. పరిస్థితిపై చర్చించేందుకు అధికార జేఎంఎం సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం ఎమ్మెల్యేలు సీఎం నివాసంలో బుధవారం సమావేశమయ్యారు. ఇదే సమయంలో సీఎం సన్నిహితుల నివాసాలపై ఉదయం నుంచి ఈడీ దాడులు జరపడం మరో కీలక పరిణామం. ముఖ్యమంత్రి పదవికి సోరెన్ రాజీనామా చేసి తన భార్య కల్పనా సోరెన్‌కు సీఎం పగ్గాలు అప్పగించనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


ఈడీ దాడులు..

మనీ లాండరింగ్ నిబంధనల క్రింద జార్ఖాండ్ రాజధాని రాంచీతో పాటు, రాజస్థాన్‌లో ఈడీ బుధవారంనాడు దాడులు జరిపింది. జార్ఖాండ్ సీఎం మీడియా సలహాదారు అభిషేక్ ప్రసాద్ అలియాస్ పింటూ, మాజీ ఎమ్మెల్యే పప్పుయాదవ్, పలువురు జైళ్ల శాఖ అధికారులు, ఒక పోలీస్ కానిస్టేబుల్ నివాసాల్లో ఈడీ టీమ్ సోదాలు చేపట్టింది. కేంద్ర భద్రతా బలగాల రక్షణ మధ్య ఈడీ అధికారులు ఈ సోదాలు జరిపారు. అభిషేక్ ప్రసాద్‌ను గతంలోనూ ఈడీ ప్రశ్నించింది. కేసులో కొత్త సమాచారం ఆధారంగా ఈడీ తాజా దాడులు జరిపినట్టు చెబుతున్నారు.


కూటమి నేతల సమావేశం

భూఆక్రమణ కేసులో ముఖ్యమంత్రికి ఈడీ సమన్ల నేపథ్యంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితిని సమీక్షించేందుకు జేఎంఎం కూటమి ఎమ్మల్యేలు సీఎం నివాసంలో సమావేశమయ్యారు. దీంతో సీఎం నివాస వెలుపల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, సోరెన్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకే ఈడీ దాడులతో సహా బీజేపీ చేయని ప్రయత్నాలు లేవని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుబోధ్ కాంత్ సహాయ్ ఆరోపించారు. గత నాలుగు దశాబ్దాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలను ఇంతగా దుర్వినియోగం చేయడం ఎన్నడూ చూడలేదన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 07:14 PM