Kangana Ranaut: సాగుచట్టాలపై వ్యాఖ్యలకు కంగన క్షమాపణ
ABN , Publish Date - Sep 25 , 2024 | 03:35 PM
సాగు చట్టాలపై తన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవని, పార్టీ వైఖరితో వీటికి ఎలాంటి సంబంధం లేదని కంగన రనౌత్ వివరించారు. సాగుచట్టాలను వెనక్కి తేవాలంటూ ఇటీవల కంగన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలతో ఇటీవల తరచు వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) సాగుచట్టాల (Farma Laws) వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. 2021లో రద్దు చేసిన సాగు చట్టాలను మళ్లీ తీసుకురావాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై కంగన కంగన తాజాగా స్పందించారు. తన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతూ, వాటిని వెనక్కి తీసుకుంటున్నానని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక వీడియో పోస్ట్ చేశారు.
సాగు చట్టాలపై తన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవని, పార్టీ వైఖరితో వీటికి ఎలాంటి సంబంధం లేదని కంగన రనౌత్ వివరించారు. ''గత కొద్దిరోజులుగా సాగుచట్టాలపై మీడియా కొన్ని ప్రశ్నలు అడుగుతోంది. సాగుచట్టాలను వెనక్కి తీసుకురావాలని ప్రధానిని రైతులు రిక్వెస్ట్ చేయాలని నేను సూచించాను. సాగుచట్టాలను ప్రతిపాదించినప్పుడు మనలో చాలా మంది మద్దతిచ్చారు. కానీ ప్రధానమంత్రి ఎంతో సెన్సిటివిటీ, సానుభూతితో వాటిని ఉపసంహరించారు. ప్రధాని నిర్ణయానికి కట్టుబడి ఉండటం ప్రతి బీజేపీ కార్యకర్త బాధ్యత. ఇప్పుడు నేను కేవలం నటిని మాత్రమే కాదు. ఓ రాజకీయ కార్యకర్తను. వ్యక్తిగతంగా చెప్పినప్పటికీ పార్టీ వైఖరిని ప్రతిబింబిస్తాయనే విషయాన్ని గుర్తించా. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే క్షమాపణ చెబుతున్నాను. వాటని వెనక్కి తీసుకుంటున్నాను'' అని కంగన ఆ వీడియోలో తెలిపారు.
MUDA Scam Case: సిద్ధరామయ్యపై లోకాయుక్త దర్యాప్తునకు ప్రత్యేక కోర్టు ఆదేశం
కంగన ఇంతకుముందు ఏమన్నారు?
కంగనా రనౌత్ మంగళవారంనాడు మండి నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడుతూ, సాగుచట్టాలపై కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే నిరసలు వచ్చాయని అన్నారు. దేశాభివృద్ధిలో రైతులు వెన్నెముక అని, రైతుల ప్రయోజనాల రీత్యా సాగుచట్టాలను వెనక్కి తీసుకురావాలని రైతన్నలు డిమాండ్ చేయాలని అన్నారు. కాగా, కంగన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా విపక్షాలు మండిపడ్డాయి. వివాదాస్పద సాగుచట్టాలను రద్దు చేయాలంటూ 700 మంది రైతులు ప్రాణత్యాగాలు చేశారని, ఇప్పుడు మళ్లీ వాటిని వెనక్కి తీసుకువస్తామనడం బీజేపీ రెండు నాల్కల ధోరణినే చెబుతోందని కాంగ్రెస్ విమర్శించింది.
కంగన వ్యాఖ్యలతో సంబంధం లేదన్న బీజేపీ
కాగా, కంగనా వ్యాఖ్యలపై బీజేపీ దూరం పాటించింది. కంగన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, పార్టీ తరఫున అలాంటి వ్యాఖ్యలు చేసే అధికారం ఆమెకు లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఓ ప్రకటనలో తెలిపారు.
Read More National News and Latest Telugu News
Also Read: Jammu and Kashmir Assembly Elections: కొనసాగుతున్న రెండో విడత పోలింగ్