MVA poll: మహారాష్ట్ర ఎన్నికలు.. మహా వికాస్ అఘాడి మేనిఫెస్టో ఇదే
ABN , Publish Date - Nov 10 , 2024 | 02:03 PM
మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలు ప్రచార కార్యక్రమాలను మరింత ఉధృతం చేశాయి. పోటాపోటీగా మేనిఫెస్టోలను కూడా విడుదల చేశాయి. ఇవాళ ఉదయం బీజేపీ సారధ్యంలోని కూటమి మేనిఫెస్టో విడుదల చేయగా.. కొద్దిసేపటికే ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి (MVA) కూడా మేనిఫెస్టోని ప్రకటించింది.
ముంబై: మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలు ప్రచార కార్యక్రమాలను మరింత ఉధృతం చేశాయి. పోటాపోటీగా మేనిఫెస్టోలను కూడా విడుదల చేశాయి. ఇవాళ ఉదయం బీజేపీ సారధ్యంలోని కూటమి మేనిఫెస్టో విడుదల చేయగా.. కొద్దిసేపటికే ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి (MVA) కూడా మేనిఫెస్టోని ప్రకటించింది. తమ కూటమి అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో కుల గణనను అమలు చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 50 శాతంగా ఉన్న రిజర్వేషన్ పరిమితిని పెంచుతామని ప్రకటించారు. కూటమి ఎన్నికల మేనిఫెస్టోను ఖర్గే విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
“మహారాష్ట్రలో కుల గణన చేపడతాం. తమిళనాడు తరహాలో 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని పెంచుతాం. కుల గణన ప్రజల మధ్య విభజన తీసుకురావడానికి కాదు. వివిధ వర్గాలకు చెందిన వారు మరింత ప్రయోజనాలను పొందేలా చూడడమే దీని ముఖ్య ఉద్దేశం’’ అని ఖర్గే పేర్కొన్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని శూన్యంగా చూపించారంటూ ఇటీవల ప్రధాని మోదీ చేసిన విమర్శలపై ఖర్గే ఘాటుగా స్పందించారు. నరేంద్ర మోదీ ఒక అబద్ధాల రారాజు అని ఆయన అభివర్ణించారు.
మేనిఫెస్టో ఇదే..
మహా వికాస్ అఘాడి ప్రకటించిన మేనిఫెస్టోలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, ఆరోగ్యం వంటి రంగాలకు సంబంధించి ప్రధానంగా 5 హామీలు ఉన్నాయి. ‘‘మహారాష్ట్ర అభివృద్ధి కోసం మాకు ఐదు స్తంభాలు ఉన్నాయి. మా ఐదు హామీలు రాష్ట్రంలోని కుటుంబాల అభ్యున్నతికి దోహదపడతాయి. ప్రతి కుటుంబానికి ఏడాదికి దాదాపు రూ.3.5 లక్షల ప్రయోజనాలు లభిస్తాయి’’ అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. మహాలక్ష్మి యోజన కింద మహిళలకు ప్రతి నెలా ప్రకటించారు. రాజస్థాన్‌లో మాదిరిగా రూ.25 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని మహారాష్ట్రలో అమలు చేస్తామని ఖర్గే తెలిపారు. ఉచితంగా వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.
రైతు రుణ మాఫీ..
రైతులకు రూ.3 లక్షల వరకు వ్యవసాయ రుణ మాఫీ చేస్తామని మహా వికాస్ అఘాడీ హామీ ఇచ్చింది. కాగా రూ.3 లక్షలకు పైగా రుణాలను చెల్లించే రైతులకు రూ.50,000 సాయం అందిస్తామని తెలిపింది. నిరుద్యోగుల విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా చదవిన నిరుద్యోగ యువకులకు నెలకు రూ.4,000 ఇస్తామని ప్రకటించారు.