‘ఇండియా’ చైర్మన్‌గా ఖర్గే.. కూటమి ఏకగ్రీవ ఆమోదం..
ABN , Publish Date - Jan 14 , 2024 | 08:38 AM
ప్రతిపక్ష కూటమి ఇండియా చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కన్వీనర్‌గా జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ పేరును కూటమి నేతలు ప్రతిపాదించారు.
- కన్వీనర్‌గా నితీశ్ పేరు ప్రతిపాదన..
- తిరస్కరించిన జేడీయూ అధినేత
- వర్చువల్‌గా భేటీ అయిన కూటమి
- లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై చర్చ
- ముందస్తు పనుల వల్ల భేటీకి హాజరుకాని మమత, అఖిలేశ్, ఉద్ధవ్
న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పట్నా, జనవరి 13: ప్రతిపక్ష కూటమి ఇండియా చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కన్వీనర్‌గా జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ పేరును కూటమి నేతలు ప్రతిపాదించారు. అయితే, ఆయన సున్నితంగా తిరస్కరించారు. శనివారం ఇండియా కూటమి పార్టీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యాయి. ఏప్రిల్-మే నెలలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధత గురించి చర్చలు జరిపాయి. ఈ సందర్భంగానే, కూటమికి నేతృత్వం వహించే నాయకుడి ఎంపికపై చర్చ జరిగింది. ఈ పదవికి కాంగ్రెస్ నుంచే ఎవరైనా ఉంటే బాగుంటుందని స్వయంగా నితీశ్‌కుమార్ పేర్కొన్నారు. మిగిలిన నేతలు కూడా దీనికి అంగీకరించారు. ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే పేరు ముందుకు రాగా, హాజరైన నేతలందరూ ఆమోదం తెలిపారు. తద్వారా ఆయన ఇండియా కూటమి చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అయితే, కూట మి కన్వీనర్ పదవిని నితీశ్‌కుమార్ కోరుకుంటున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఇదే సమావేశంలో.. చైర్‌పర్సన్ తర్వాత స్థానమైన కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టవలసిందిగా కోరుతూ పలువురు నితీశ్ పేరును ప్రతిపాదించారు. దీనిని నితీశ్ సున్నితంగానే తిరస్కరించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, దీనిపై జేడీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్ కు మార్ ఝా మాత్రం భిన్నంగా స్పందించారు. సదరు ప్రతిపాదనకు నితీశ్ ఇప్పటి వరకైతే ఆమోదం తెలుపలేదని, దీనిపై తమ పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పటం విశేషం. శనివారం నాటి సమావేశానికి నితీశ్‌తోపాటు సంజ య్ కుమార్ ఝా కూడా హాజరయ్యారు. ఖర్గేకు చైర్‌పర్సన్ పదవిని అప్పగించటంపై నితీశ్ నిరాశ చెందా రా అన్న విలేకర్ల ప్రశ్నకు.. అటువంటిదేమీ లేదని, ఆ పదవిని కాంగ్రెస్ కు చెందిన వారే ఎవరైనా తీసుకోవాలని స్వయంగా నితీశే ప్రతిపాదించారన్నారు. కాగా, ఇండియా కూటమి వర్చువల్ భేటీకి.. ముందస్తు కా ర్యక్రమాల కారణంగా మమతాబెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), ఉద్ధవ్ ఠాక్రే (శివసేన) హాజరు కాలేదు. కన్వీనర్‌గా నితీశ్ నియామకంపై వారితోనూ చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సమావేశంలో నితీశ్ కుమార్ (జేడీయూ), శరద్ ప వార్ (ఎన్సీపీ), స్టాలిన్, కనిమొళి (డీఎంకే), హేమం త్ సోరెన్ (జేఎంఎం) తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయం అందిస్తాం: పవార్
కూటమి సమావేశం అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను విలేకర్లు సంప్రదించగా, కన్వీనర్ పదవి కోసం నితీశ్ పేరును ప్రతిపాదించినప్పటికీ.. అసలు కన్వీనర్ పదవే అవసరం లేదని, దాని బదులు కొన్ని పార్టీల అధినేతలతో ఒక కమిటీని ఏర్పాటు చేయటం మంచిదని నితీశ్ అభిప్రాయపడ్డారని పవార్ చెప్పారు. ‘ఓట్ల కోసం ఎవరో ఒక నేతను ముందు పెట్టాల్సిన అవసరం లేదు. ఎన్నికల తర్వాత ఒక నేతను మేం ఎన్నుకుంటాం. ప్రజలకు ప్రత్యామ్నాయం అందిస్తామన్న నమ్మకంతో ఉన్నాం. 1977లో కూడా నాటి ప్రతిపక్షాలు ఎన్నికల ముందే మొరార్జీ దేశాయ్ పేరును ప్రధాని అభ్యర్థిగా ఏమీ ప్రచారం చేయలేదు’ అని గుర్తు చేశారు. కూటమి అనుసరించాల్సిన విధానాల గురించి చర్చ జరిగిందని, సీట్ల పంపకాలపై మాట్లాడుకోలేదని వెల్లడించారు. దేశవ్యాప్తంగా సంయుక్తంగా బహిరంగ సభ లు నిర్వహించాలని, ఆ మేరకు ఒక కమిటీని ఏర్పా టు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
తన పరిమితుల్ని కాంగ్రెస్ తెలుసుకోవాలి: తృణమూల్
ఇండియా కూటమి వర్చువల్ సమావేశానికి తమ అధినాయకురాలు మమతా బెనర్జీ పలు ముందస్తు కార్యక్రమాల కారణంగా హాజరు కాలేదని తృణమూ ల్ కాంగ్రెస్ ఎంపీ ఒకరు తెలిపారు. బెంగాల్‌లో రాజకీయ పరిస్థితులపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రె్‌సకు ఉన్న పరిమితుల్ని, బలహీనతల్ని ఆ పార్టీ అధిష్ఠానం గుర్తించాలన్నారు. బెంగాల్‌లో బీజేపీని ఓడించే పోరాటానికి తాము నేతృత్వం వహిస్తామని, కాంగ్రెస్ ఇందుకు అంగీకరించాలన్నారు. కాగా, బెంగాల్‌లో సీట్ల పంపకాలపై ఢిల్లీకి చర్చలకు రావాల్సిందిగా ఇటీవల కాంగ్రెస్ పంపిన ఆహ్వానాన్ని తృణమూల్ తిరస్కరించింది. కాగా, ఇండియా కూటమి వర్చువల్ మీటింగ్‌ను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎద్దేవా చేస్తూ.. ‘అదొక వర్చువల్ కూటమి. కాబట్టి వర్చువల్ సమావేశాలే జరుపుతుంది’ అని పేర్కొన్నారు.