Kolkata: కోల్‌కతాలో భారీ వర్షాలు... పడవల్లాగా విమానాలు
ABN , Publish Date - Aug 03 , 2024 | 04:33 PM
రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరదల ధాటికి నగరంలోని ప్రధాన రహదారులన్ని జలమయమయ్యాయి.
కోల్‌కతా: రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరదల ధాటికి నగరంలోని ప్రధాన రహదారులన్ని జలమయమయ్యాయి. పలు చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండటంతో స్థానికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.
అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కాగా కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వరద నీరు చుట్టు ముట్టింది. విమానాశ్రయ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విమానాశ్రయం రన్‌వే, టాక్సీవేలు జలమయమయ్యాయి. కోల్‌కతాతోపాటు పరిసర ప్రాంతాలైన హౌరా, సాల్ట్ లేక్, బరాక్‌పూర్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. దీనికితోడు తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ అల్పపీడనం ప్రస్తుతం బిహార్, ఉత్తరప్రదేశ్ వైపు మళ్లుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ జిల్లాలపై అల్పపీడనం ప్రభావం తీవ్రంగా ఉంది. విమానాశ్రయంలో నిలిచిన నీటిని తోడివేయడానికి అధికారులు మోటార్లు ఉపయోగిస్తున్నారు.
రాగల 12 గంటల్లో అతి భారీ వర్షాలు..
ఓ వైపు వర్షాలు కోల్‌కతాను ముంచెత్తుతుండగా.. రాగల 12 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. హౌరా, పశ్చిమ్ బర్ధమాన్, బీర్భూమ్, పుర్బా బర్ధమాన్, హుగ్లీ, నదియా, ఉత్తర, దక్షిణ 24 పరగణాలతో సహా దక్షిణాది జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి.
మధ్య, దక్షిణ కోల్‌కతాలోని కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీళ్లు నిలిచినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయినప్పటికీ కోల్‌కతాలో శుక్రవారం 30.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, అత్యల్పంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఐఎండీ హెచ్చరికలు..
కోల్‌కతా సహా పశ్చిమ బెంగాల్‌లోని గంగా నది తీర జిల్లాల్లో 11 సెంటీమీటర్ల వరకు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పురూలియా, ముర్షిదాబాద్, మాల్దా, కూచ్‌బెహార్, జల్‌పైగురి, డార్జిలింగ్, కాలింపాంగ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అలీపుర్‌దూర్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలీపుర్‌దూర్‌లో 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.