Madras High Court : భర్త తరఫున లంచం తీసుకుంటే భార్యకూ శిక్ష
ABN , Publish Date - Jun 03 , 2024 | 04:55 AM
ప్రభుత్వ ఉద్యోగి తీసుకునే లంచంలో భార్యకు భాగస్వామ్యం ఉంటే ఆమె కూడా శిక్షకు అర్హురాలేనని మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ అభిప్రాయపడింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో భర్తతో పాటు భార్యకు కూడా శిక్ష వేస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయడానికి తిరస్కరించింది.
అక్రమ సంపాదన ఫలితాన్ని అనుభవించాల్సిందే
కింది కోర్టు తీర్పును ఆమోదించిన మద్రాసు హైకోర్టు
కింది కోర్టు తీర్పుకు మద్రాసు హైకోర్టు ఆమోదం
మదురై, జూన్ 2: ప్రభుత్వ ఉద్యోగి తీసుకునే లంచంలో భార్యకు భాగస్వామ్యం ఉంటే ఆమె కూడా శిక్షకు అర్హురాలేనని మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ అభిప్రాయపడింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో భర్తతో పాటు భార్యకు కూడా శిక్ష వేస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయడానికి తిరస్కరించింది. భర్త తరఫున భార్య లంచం పుచ్చుకోవడం తప్పేనని, ఇందుకు ఆమెకు శిక్ష వేయాల్సి ఉంటుందని పేర్కొంది. 1992 జనవరి 1 నుంచి 1996 డిసెంబరు 31 వరకు ఆదాయానికి మించి రూ.6.77 లక్షలు అధికంగా కలిగి ఉన్నారంటూ పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్ శక్తివేల్‌పై కేసు నమోదయింది.
తిరుచ్చిలోని డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (డీవీఏసీ) పోలీసులు ఆయనతో పాటు, లంచం సొమ్ము తీసుకున్నందుకు ఆయన భార్య దైవ నాయకిపైనా కేసు పెట్టారు. కేసు విచారణలో ఉండగానే శక్తివేల్ మరణించారు. విచారణ జరిపిన అవినీతి నిరోధక ప్రత్యేక కోర్టు దైవ నాయకికి ఏడాది జైలు శిక్ష, రూ.వేయి జరిమానా విధిస్తూ 2017లో తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ ఆమె మద్రాసు హైకోర్టులోని మదురై బెంచ్‌లో అప్పీలు చేశారు.
విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ కె.కె.రామకృష్ణన్ కింది కోర్టు ఇచ్చిన కొట్టివేయడానికి నిరాకరించారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకోకుండా చూడాల్సిన బాధ్యత భార్యపై ఉంది. ఆ సొమ్ముతో వారు సంతోషపడ్డారంటే ఆ బాధను కూడా అనుభవించాల్సిందే. భర్త తరఫున లంచం తీసుకుంటే ఇంటి నుంచే అవినీతి ఆరంభమవుతుంది. అవినీతిలో ఇల్లాలికి కూడా భాగస్వామ్యం ఉంటే ఇక అక్రమాలకు అంతం ఉండదు. అక్రమ సంపాదన కారణంగా దైవనాయకి జీవితం పూలపాన్పులా ఉంది. అందువల్ల ఆమె ప్రతిఫలాన్ని..అంటే శిక్షను అనుభవించాల్సిందే’’ అని స్పష్టం చేశారు.