Share News

ఆఘాడీకి బీటలు!

ABN , Publish Date - Dec 14 , 2024 | 04:17 AM

మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల ప్రకంపనలు ప్రతిపక్ష కూటమి మహా వికాస్‌ ఆఘాడీని కుదిపేస్తూనే ఉన్నాయి.

ఆఘాడీకి బీటలు!

బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఒంటరి పోటీకే ఉద్ధవ్‌ పార్టీ మొగ్గు

ముంబై, డిసెంబరు 13: మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల ప్రకంపనలు ప్రతిపక్ష కూటమి మహా వికాస్‌ ఆఘాడీని కుదిపేస్తూనే ఉన్నాయి. ఆఘాడీ నుంచి వేరయిపోయి, ఒంటరిగా మహారాష్ట్రలో ఎదగాలని శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే) యోచిస్తున్నట్టు సమాచారం. స్వతంత్రదారిని ఎన్నుకునేందుకు ఇదే సరైన సమయమని అసెంబ్లీలో ఆ పార్టీ పక్ష నేత అంబదాస్‌ ధాన్వే వ్యాఖ్యానించగా, తాజాగా ఆ పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ కూడా అదే అభిప్రాయాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న బృహన్‌ ముంబై కార్పొరేషన్‌, ఇతర నగరాల్లో జరిగే స్థానిక ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కొంటామన్న సంకేతాలను ఆయన అందించారు. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలనుకుంటే నిరభ్యంతరంగా ఆ పని చేయొచ్చునని ఆఘాడీలోని తక్కిన పార్టీలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. అయితే, సంజయ్‌ రౌత్‌ ఒత్తిడిలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ఏవిధంగా పోటీకి దిగాలనేది ఆయన పార్టీ ఇష్టమని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది. తాము మాత్రం కలిసి పోటీచేయాలని కోరుకుంటున్నామని ఆ పార్టీ నేత విజయ్‌ వాడెట్టివర్‌ అన్నారు. ఇదిలా ఉండగా, అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్‌ ఓటమి నేపథ్యంలో తనను బాధ్యతల నుంచి తప్పించాలని ఆ పార్టీ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు నానా పటోలే అధిష్ఠానాన్ని కోరారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ఒక లేఖను మెయిల్‌ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో 101 సీట్లలో పోటీచేసి కేవలం 16 స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకుంది.

Updated Date - Dec 14 , 2024 | 04:17 AM