పీఠముడి
ABN , Publish Date - Nov 26 , 2024 | 03:37 AM
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చినా, ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు.
సీఎం ఎవరనేది తేల్చుకోలేకపోతున్న మహాయుతి పక్షాలు
ఢిల్లీలో పార్టీ పెద్దలతో చర్చలు జరిపి ముంబైకి ఫడణవీస్
ఫడణవీస్-శిందే సీఎంలుగా చెరి రెండున్నరేళ్లని ప్రచారం
ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం 15వ అసెంబ్లీ ప్రారంభమైనట్లే
మహారాష్ట్రలో రాష్ట్రపతిపాలన ఉండకపోవచ్చు: నిపుణులు
ముంబై, న్యూఢిల్లీ, నవంబరు25: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చినా, ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశమై చర్చలు జరిపిన దేవేంద్ర ఫడణవీస్ తిరిగి ముంబైకి వెళ్లిపోయారు. శివసేన అధ్యక్షుడు ఏక్‌నాథ్ శిందే, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ కూడా ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశంలో చర్చలు జరిపాకే తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. 288 స్థానాలకు గాను 132 చోట్ల గెలుపొందడంతో ఈసారి బీజేపీ సీఎం ఉండాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. ఫడణవీ్‌సనే సీఎం చేస్తారని, శిందే, అజిత్ పవార్‌లను డిప్యూటీ సీఎంలుగా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఫడణవీస్ బ్రాహ్మణ వర్గానికి చెందిన నేత కావడంతో అధిష్టానం ఓబీసీ, లేదా దళిత నేపథ్యం ఉన్న నేత కోసం చూస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఎన్నికల్లో శివసేన 57 చోట్ల మాత్రమే నెగ్గినా తన నేతృత్వంలో కూటమి ఘన విజయం సాధించడంతో తనను సీఎంగా కొనసాగించాలని శిందే పట్టుబడుతున్నట్లు సమాచారం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటం, మరాఠా నేపథ్యం శిందేకు కలిసివచ్చే అవకాశం ఉంది.
మరోవైపు ఈ ఎన్నికల్లో 41 చోట్ల గెలిచిన ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ ప్రస్తుత తరుణంలో ఫడణవీ్‌సకు మద్దతీయాలని నిర్ణయించుకున్నారు. అయితే దేవేంద్ర ఫడణవీస్, ఏక్‌నాథ్ శిందే చెరి రెండున్నరేళ్లు సీఎంగా కొనసాగే అవకాశముందనే ప్రచారం కూడా జరుగుతోంది. బీజేపీకి 21, శివసేనకు 12, ఎన్సీపీకి 10 మంత్రిత్వ శాఖలు ఇవ్వాలని నిర్ణయం జరిగినట్లు సమాచారం.
అసెంబ్లీ గడువు తీరిపోయేది నేడే
మహారాష్ట్రలో ప్రస్తుత 14వ అసెంబ్లీకి నేటితో గడువు తీరిపోనుంది. దీంతో నేడు ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే రాష్ట్రపతి పాలన విధిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను ఎన్నికల సంఘం అధికారులు ఈ నెల 24న గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు అందజేశారు. దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టం 73వ సెక్షన్ ప్రకారం 15 అసెంబ్లీ ప్రారంభమైనట్లేనని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం ఇక రాష్ట్రపతి పాలన ఉండకపోవచ్చని సమాచారం. ఢిల్లీలో జరుగుతున్న మంతనాలు కొలిక్కి వచ్చి, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మరో మూడు, నాలుగు రోజుల సమయం పట్టవచ్చని తెలుస్తోంది.