నేడు కొలువుదీరనున్న ‘మహా’ సర్కారు?
ABN , Publish Date - Nov 25 , 2024 | 03:59 AM
మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం సోమవారం కొలువుదీరనుంది..! ప్రస్తుత శాసనసభ కాలపరిమితి మంగళవారంతో ముగియనుంది.
సీఎం ఎవరనేదానిపై సస్పెన్స్.. ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవి
మంత్రులుగా తొలుత ఏడుగురే!.. కూటమిలో పదవుల పంపిణీ
బీజేపీకి 22-24, సేనకు 10-12.. అజిత్ వర్గానికి 8-10!
ముంబై, నవంబరు 24: మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం సోమవారం కొలువుదీరనుంది..! ప్రస్తుత శాసనసభ కాలపరిమితి మంగళవారంతో ముగియనుంది. దాంతో సోమవారమే కొత్త సర్కారును ఏర్పాటు చేయడం అనివార్యమైంది. ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, ఆరు లేదా ఏడుగురు మంత్రులు ప్రమాణం చేయవచ్చని తెలుస్తోంది. తదుపరి విస్తరణలో.. బీజేపీకి చెందిన 22-24 మంది ఎమ్మెల్యేలకు చోటుదక్కుతుందని సమాచారం. శిందే వర్గానికి 10-12, అజిత్ వర్గానికి 8-10 మంత్రి పదవులు దక్కుతాయని తెలుస్తోంది.
కౌన్ బనేగా సీఎం?
కొత్త ముఖ్యమంత్రి ఎవరనేదానిపైనా మహాయుతి కూటమిలో చర్చలు, సంప్రదింపులు కొనసాగుతున్నాయి. సొంతంగానే అత్యధిక స్థానాలు సాధించి, అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన బీజేపీ, తమ పార్టీ నాయకుడు, ఇప్పటి వరకు ఉపముఖ్యమంత్రిగా ఉన్న దేవంద్ర ఫడణవీస్ వైపే మొగ్గుచూపుతోంది. అదే సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే పనితీరును బీజేపీ పెద్దలు ప్రశంసిస్తున్నారు. మరోవైపు.. శివసేన(శిందేవర్గం) నాయకులు శిందేకు.. ఎన్సీపీ(అజిత్‌వర్గం) నేతలు అజిత్‌పవార్‌కు సీఎం పదవి ఇవ్వాలని కోరుతున్నారు. అయితే.. సీఎంగా ఎవరిని నియమించాలనేదానిపై సంప్రదింపుల వేదిక ఇప్పుడు ముంబై నుంచి ఢిల్లీకి మారింది. కూటమి అగ్రనేతలు ఢిల్లీకి పయనమయ్యారు. సోమవారం ఉదయానికల్లా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి.
ఫడణవీ్‌సకు న్యాయంగా సీఎం పీఠం దక్కాలని ఆరెస్సెస్ అభిప్రాయపడుతోంది. మహారాష్ట్ర ప్రజలు ఇంత భారీ మెజారిటీని కట్టబెట్టిన నేపథ్యంలో.. బీజేపీ సొంత పార్టీ నేతకే సీఎం పగ్గాలు అప్పగించడం సబబనే సందేశాన్ని పరోక్షంగా బీజేపీ అగ్రనాయకులకు పంపినట్లు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. అయితే కులపరమైన సమీకరణలు ఫడణవీస్ అభ్యర్థిత్వానికి ప్రతికూలతలుగా పరిణమించవచ్చని తెలుస్తోంది. మహారాష్ట్రలో ప్రాబల్యం అధికంగా ఉన్న మరాఠాలు తమ వర్గానికే ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలనే డిమాండ్‌ను గట్టిగా వినిపిస్తున్నారు. కాదని.. బీజేపీ అధినాయకత్వం ఫడణవీస్ వైపు మొగ్గుచూపితే.. ఇంతకాలం సీఎంగా ఉన్న శిందే ఆయన వద్ద ఉపముఖ్యమంత్రిగా పనిచేసేందుకు సునాయాసంగా అంగీకరిస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.