Malaysia Airlines: విమానం గాల్లో ఉండగా షాకింగ్ ప్రమాదం.. చివరికి ఏమైందంటే?
ABN , Publish Date - Jun 20 , 2024 | 03:47 PM
మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన MH 199 అనే విమానం బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరింది.
సాధారణంగా.. టేకాఫ్‌కి ముందు విమానాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎలాంటి అవాంతర సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలన్న ఉద్దేశంతో.. లోపాలేమైనా ఉన్నాయా? అని పూర్తిగా సమీక్షిస్తారు. అంతా ఓకే అనుకున్న తర్వాతే దాన్ని రన్‌వేలోకి తీసుకొస్తారు. అయితే.. ఇలాంటి సేఫ్టీ పరీక్షలు నిర్వహించినప్పటికీ అప్పుడప్పుడు కొన్ని అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. అలాంటి సంఘటనే ఇప్పుడు తాజాగా వెలుగు చూసింది. గాల్లోకి ఎగిరిన తర్వాత ఓ విమానంలోని ఇంజిన్‌లో (Flight Fire Accident) మంటలు చెలరేగాయి. దీంతో పైలట్ వెంటనే అప్రమత్తమై.. ఎమెర్జెన్సీ ల్యాండింగ్ చేసి ప్రయాణికుల్ని రక్షించాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన MH 199 అనే విమానం బుధవారం అర్థరాత్రి (12:45) దాటిన తర్వాత హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరింది. గాల్లో ఎగిరిన కాసేపటి వరకూ ప్రయాణం సజావుగానే సాగింది. కానీ.. కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఆ ఇంజిన్‌కి పక్కనే కూర్చున్న ఓ ప్రయాణికుడు.. ఆ దృశ్యాలను తన ఫోన్‌లో రికార్డ్ చేశాడు. ఇలా ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో.. విమానం వేగం తగ్గింది. ఈ విషయాన్ని పసిగట్టిన పైలట్.. విమానాన్ని తిరిగి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకి తీసుకొచ్చాడు. కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టాక.. తెల్లవారుజామున 3:21 గంటల సమయంలో ల్యాండ్ చేశాడు. ప్రయాణికులను సురక్షితంగా దించేసి.. ఆ విమానాన్ని తనిఖీ కోసం తీసుకెళ్లారు.
ఈ ఘటన గురించి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ.. సాంకేతిక లోపం వల్లే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయని తెలిపారు. ఆ విమానాన్ని తనిఖీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంజిన్‌లో మంటలు చెలరేగిన వెంటనే విషయాన్ని గుర్తించి.. పైలట్స్ ఎంతో చాకచక్యంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు తిరిగి తీసుకొచ్చారని అన్నారు. ప్రయాణికులను తమతమ గమ్యస్థానాలకు చేర్చేందుకు గాను ఇతర విమానాలను కేటాయించడం జరిగిందని చెప్పారు. తమ ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడదని పేర్కొన్నారు.
Read Latest National News and Telugu News