Share News

Mamata Banerjee: రాజీనామాకు నేను సిద్ధమే.. దీదీ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 12 , 2024 | 08:25 PM

ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) స్పష్టం చేశారు.

Mamata Banerjee: రాజీనామాకు నేను సిద్ధమే.. దీదీ సంచలన వ్యాఖ్యలు

కోల్‌కతా: ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) స్పష్టం చేశారు. వైద్యులతో సమావేశం నిర్వహించడానికి ఆమె గురువారం దాదాపు 2 గంటలపాటు ఎదురుచూడగా.. చర్చలకు ఎవరూ రాకపోవడంపై స్పందించారు. దీంతో బెంగాల్‌లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్న జూనియర్ వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చల విషయమై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వారితో సమావేశం కోసం గురువారం దాదాపు రెండు గంటలపాటు ఎదురుచూశానని, వారి నుంచి స్పందన లేకుండా పోయిందని దీదీ తెలిపారు. ఇవాళ్టితో సమస్యకు తెరపడుతుందని ఆశించిన రాష్ట్ర ప్రజలకు ఆమె క్షమాపణ చెప్పారు.


"ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. అందుకే వైద్యులు డిమాండ్ చేసినట్లు చర్చలను లైవ్ ఇవ్వలేం. అయితే.. సమావేశానికి సంబంధించి వీడియో రికార్డింగ్ ఏర్పాట్లు చేశాం. సుప్రీంకోర్టు అనుమతితో పుటేజీని వైద్యులకు అందజేస్తాం. చర్చలు జరిపేందుకు ఇప్పటికే మూడుసార్లు ప్రయత్నించా. వైద్యులు విధులకు దూరంగా ఉండటంతో ఏడు లక్షల మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో వైద్యం అందక 27 మంది మృతి చెందారు. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోను. పెద్దవాళ్లం కాబట్టి వారిని క్షమిస్తాను. వైద్యులంతా విధులకు హాజరుకావాలి" అని మమతా బెనర్జీ కోరారు.


నెలకుపైగా నిరసనలు..

బెంగాల్ హత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యార్థులు చేస్తున్న నిరసనలు నెల రోజులు దాటాయి. ఇందులో భాగంగానే వారితో చర్చలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. బుధవారం చర్చలకు రావాలని ఆహ్వానించగా.. 30 మంది ప్రతినిధులకు అనుమతించాలని, ఈ భేటీని ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ వారు కండీషన్లు పెట్టారు. వారి షరతులను తిరస్కరించిన అధికారులు గురువారం మరోసారి చర్చలకు ఆహ్వానించారు. ఈ క్రమంలోనే సెక్రటేరియెట్‌కు చేరుకున్నా వైద్యులు సమావేశానికి హాజరుకాలేదు.

Updated Date - Sep 12 , 2024 | 08:30 PM