Share News

West Bengal: కోల్‌కతా ఘటనపై ప్రధాని మోదీకి దీదీ లేఖ.. ఏమన్నారంటే

ABN , Publish Date - Aug 22 , 2024 | 07:45 PM

దేశవ్యాప్తంగా కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై చర్చ జరుగుతున్న వేళ.. ఆ రాష్ట్ర మఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇందులో ఆమె మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రస్తావించారు.

West Bengal: కోల్‌కతా ఘటనపై ప్రధాని మోదీకి దీదీ లేఖ.. ఏమన్నారంటే

కోల్‌కతా: దేశవ్యాప్తంగా కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై చర్చ జరుగుతున్న వేళ.. ఆ రాష్ట్ర మఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇందులో ఆమె మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రస్తావించారు. వీటిని ఆపడానికి కఠిన చట్టాలు తీసుకురావాలని ప్రధాని మోదీని కోరారు.

‘‘దేశంలో వనితలపై జరుగుతున్న హత్యాచార ఘటనలను మీ దృష్టికి తీసుకువస్తున్నా. దేశంలోని చాలా ప్రాంతాల్లో మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా దాదాపు రోజుకు 90 అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితి భయాందోళనలు కలగజేస్తోంది. ఇలాంటి ఘటనలు సమాజం విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఈ దురాగతాలకు ముగింపు పలకడం ద్వారా మహిళలు తాము సురక్షితంగా, భద్రంగా ఉన్నామని భావన కల్పించేలా చేయడం మనందరి కర్తవ్యం. ఘోర నేరాలకు పాల్పడిన వారికి తగిన శిక్షలు విధించేలా కఠినమైన చట్టం తీసుకురావాలి. సున్నితమైన ఈ సమస్యను సమగ్ర పద్ధతిలో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అత్యాచార కేసుల్లో సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టుల ఏర్పాటును చట్టంలో చేర్చాలి. సత్వర న్యాయం జరగాలంటే కేసుల విచారణ 15 రోజుల్లో పూర్తి చేయాలి’’ అని దీదీ తన లేఖలో పేర్కొన్నారు. ఈ కేసును విచారించిన తీరుపై మమతా బెనర్జీ సర్కార్ ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీదీ సర్కార్‌పై ప్రజాగ్రహం పెరిగిపోతోందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. న్యాయం చేయాల్సింది పోయి.. దీదీనే స్వయంగా నిరసనలు చేయడం పట్ల నిరసనకారులు మండిపడుతున్నారు. దీంతో ఈ కేసు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దర్యాప్తు సంస్థ సీబీఐ తన పరిధిలోకి తీసుకుంది.


విధులకు హాజరుకండి: సుప్రీం కోర్టు

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఆందోళన చేస్తున్న వైద్యులను విధులకు హాజరుకావాలని సీజేఐ ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీతోపాటు ఆందోళనలు కొనసాగిస్తున్నామని వైద్య సంఘాలు తెలిపాయి. విధులకు హాజరైనప్పటికీ క్యాజువల్ లీవ్ కట్ చేసి వేధిస్తున్నారని ట్రైనీ డాక్టర్లు సుప్రీంకోర్టుకు వెల్లడించారు. మొదట విధులకు హాజరుకావాలని సీజేఐ సూచించారు. నేషనల్ టాస్క్‌ఫోర్స్‌లో రెసిడెంట్ డాక్టర్లను కూడా చేర్చాలని ట్రైనీ డాక్టర్లు పేర్కొన్నారు. రెసిడెంట్ డాక్టర్ల సమస్యలను ఎన్‌టీఎఫ్ వింటుందని సీజేఐ భరోసా ఇచ్చారు.

కమిటీలో భాగస్వాములుగా ఉండడానికి, కమిటీ ఎదుట వాదన చెప్పడానికి తేడా ఉంటుందని న్యాయవాదులు వెల్లడించారు. కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో సుప్రీంకోర్టుకు సీబీఐ సంచలన రిపోర్ట్‌ను అందించింది. ఈ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని సీబీఐ తన రిపోర్టులో పేర్కొంది. తల్లిదండ్రులను సైతం తప్పుదారి పట్టించారని తెలిపింది. శవ దహనం తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సీబీఐ పేర్కొంది. ఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారని వెల్లడించింది. కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సీబీఐ స్టేటస్‌కో రిపోర్టును కోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అందించారు. సీజేఐ డీవై చంద్ర చూడ్ ధర్మాసనం సీబీఐ రిపోర్టును పరిశీలించింది. స్థానిక పోలీసుల నుంచి సేకరించిన సమాచారంతో పాటు సీబీఐ సేకరించిన ఆధారాలను కోర్టుకు సొలిసిటర్ జనరల్ అందించారు.

Updated Date - Aug 22 , 2024 | 07:59 PM