Share News

West Bengal: ఆ చట్టాల అమలు వాయిదా వేయండి.. మోదీకి లేఖ రాసిన దీదీ

ABN , Publish Date - Jun 21 , 2024 | 06:09 PM

గతేడాది(2023) రాష్ట్రపతి ఆమోదం పొందిన మూడు క్రిమినల్ చట్టాల(New Criminal Laws) అమలును వాయిదా వేయాలని కోరుతూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రధాని మోదీకి(PM Modi) శుక్రవారం లేఖ రాశారు. సభలో ఎలాంటి చర్చ లేకుండానే వీటిని ఆమోదించారని.. చట్టాలపై మరోసారి సమీక్ష జరపాలని ఆమె తన లేఖలో పేర్కొన్నారు.

West Bengal: ఆ చట్టాల అమలు వాయిదా వేయండి.. మోదీకి లేఖ రాసిన దీదీ

కోల్‌కతా: గతేడాది(2023) రాష్ట్రపతి ఆమోదం పొందిన మూడు క్రిమినల్ చట్టాల(New Criminal Laws) అమలును వాయిదా వేయాలని కోరుతూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రధాని మోదీకి(PM Modi) శుక్రవారం లేఖ రాశారు. సభలో ఎలాంటి చర్చ లేకుండానే వీటిని ఆమోదించారని.. చట్టాలపై మరోసారి సమీక్ష జరపాలని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. బ్రిటీష్‌ కాలం నాటి నేర న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కొత్తగా రూపొందించిన మూడు నేర న్యాయ చట్టాలు ఈ ఏడాది జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు గతంలోనే నోటిఫికేషన్లు జారీ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి-1860, నేర శిక్షాస్మృతి-1898, భారతీయ సాక్ష్యాధార చట్టం-1872 స్థానంలో భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ నాగరిక సురక్షా సంహిత-2023, భారతీయ సాక్ష్య-2023 చట్టాలు దేశమంతా అమలవుతాయని పేర్కొంది.


అయితే వీటిపై మమతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన సమయంలోనే మూడు బిల్లులు లోక్‌సభలో ఆమోదం పొందాయని మమత తన లేఖలో పేర్కొన్నారు."కేంద్రం ఈ మూడు కీలకమైన బిల్లులను ఏకపక్షంగా, ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదించింది.

దాదాపు 100 మంది లోక్‌సభ సభ్యులను సస్పెండ్ చేశారు. ఉభయ సభలకు చెందిన మొత్తం 146 మంది ఎంపీలను పార్లమెంటు నుంచి బయటకు పంపి.. బిల్లులను ఆమోదించారు. చట్టాల అమలు తేదీని వాయిదా వేయమని కోరుతున్నా. నూతనంగా ఎన్నికైన పార్లమెంటు సభ్యుల సమక్షంలో ఈ చట్టాలపై సమీక్ష జరపాలి. తద్వారా ఎంపీలు చట్టాల్లో లోపాలపై చర్చించే అవకాశం ఏర్పడుతుంది" అని దీదీ(Mamatha Benerjee) తన లేఖలో ప్రస్తావించారు.


చిదంబరంతో సమావేశం..

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో భాగమైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం క్రిమినల్ బిల్లులను పరిశీలించిన వారిలో ఉన్నారు. ఆయన్ని మమతా గురువారం కలిశారు. ఇదే అంశంపై ఆయనతో దీదీ సుదీర్ఘంగా చర్చించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు క్రిమినల్ చట్టాల అంశాన్ని లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది.

కొత్త చట్టాల అమలును వాయిదా వేయాలనే డిమాండ్‌కు ఇండియా కూటమిపార్టీలు గతంలోనే మద్దతుపలికాయి. కాగా మూడు కొత్త క్రిమినల్ చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర న్యాయ, న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు.

For Latest News and National News click here

Updated Date - Jun 21 , 2024 | 06:09 PM