Manipur: మద్యం దుకాణాలు బంద్
ABN , Publish Date - Apr 01 , 2024 | 03:06 PM
రాష్ట్రంలో గత ఏడాది మే మాసంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ నిర్వహించే రోజులతోపాటు కౌంటింగ్ ప్రక్రియ జరిగే రోజు.. రాష్ట్రంలో మద్యం విక్రయాలు నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మణిపూర్, ఏప్రిల్ 1: రాష్ట్రంలో గత ఏడాది మే మాసంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మణిపూర్ (Manipur) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ ఎన్నికల (Loksabha Elections 2024) నేపథ్యంలో పోలింగ్ నిర్వహించే రోజులతోపాటు కౌంటింగ్ ప్రక్రియ జరిగే రోజు.. రాష్ట్రంలో మద్యం విక్రయాలు నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మణిపూర్‌లో రెండు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి విడతగా ఏప్రిల్ 19వ తేదీ, మలి విడతగా 26వ తేదీ పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతో ఆ రెండు రోజుల్లో అంటే... ఏప్రిల్ 17వ తేదీ సాయంత్రం 4.00 గంటల నుంచి ఏప్రిల్ 19వ తేదీ పోలింగ్ పూర్తి అయ్యే వరకు.. అలాగే రెండో విడత పోలింగ్ వేళ.. అంటే ఏప్రిల్ 24వ తేదీ సాయంత్రం 4.00 గంటల నుంచి 26వ తేదీ పోలింగ్ పూర్తి అయ్యే వరకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసి ఉంటాయని ఆదేశాల్లో స్పష్టం చేసింది.
అలాగే ఎన్నికల కౌంటింగ్ జూన్ 4వ తేదీన నిర్వహించనున్నారు. దీంతో ఆ రోజు సైతం మద్యం దుకాణాలు మూసి ఉంచనున్నారు. మరోవైపు రాష్ట్రంలో మొత్తం 2,955 పోలింగ్ కేంద్రాలుంటే... వాటిలో 1,058 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు మణిపూర్ రాష్ట్ర సీఈవో ప్రదీప్ కుమార్ ఝా వెల్లడించారు.