Manipur Violence: ఎన్నికల్లో హింస, 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్‌కు ఈసీఐ ఆదేశం
ABN , Publish Date - Apr 28 , 2024 | 03:36 PM
లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్‌లో భాగంగా ఈనెల 26న హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ఔటర్ మణిపూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 6 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ కు భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏప్రిల్ 30న ఇక్కడ రీపోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించింది.
ఇంఫాల్: లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్‌లో భాగంగా ఈనెల 26న హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ఔటర్ మణిపూర్ (Outer Manipur) పార్లమెంటరీ నియోజకవర్గంలోని 6 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ (repolling)కు భారత ఎన్నికల సంఘం (ECI) ఆదేశించింది. ఏప్రిల్ 30న ఇక్కడ రీపోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించింది. పోలింగ్ రద్దయిన 6 కేంద్రాల్లో నాలుగు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ముగియడానికి ముందే గుర్తుతెలియని వ్యక్తులు ఈవీఎంలు, వీవీప్యాట్‌లను ధ్వంసం చేశారు. ఒక పోలింగ్ స్టేషన్‌లో ఓటింగ్ మిషన్‌లో సమస్యలు తలెత్తాయి. గుర్తుతెలియని వ్యక్తుల బెదిరింపులు, భయాల మధ్య మరో పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ పూర్తికాలేదు.
మణిపూర్‌లో ఏప్రిల్ 19న జరిగిన తొలి విడత ఎన్నికల్లోనూ ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు జరిగాయి. సుమారు 3,000 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగగా, 11 పోలింగ్ కేంద్రాల్లో హింసాత్మక ఘటనలు చేటుచేసుకున్నాయి. ఈవీఎంలను కొందరు దుండగులు ధ్వంసం చేశారు. దీంతో 11 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఓటింగ్ చెల్లదని ప్రకటించిన ఈసీ రెండో విడత పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు ఏప్రిల్ 22న రీపోలింగ్ నిర్వహించింది.
ఎన్నికల బహిష్కరణకు పిలుపు
అపరిష్కృత సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ అధికారుల వైఫల్యానికి నిరసగా కుకీ-జోమి తెగకు చెందిన పలు పౌర సమాజ సంస్థలు, గ్రూపులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చాయి. 'నో జస్టిస్ నో ఓట్' అనే సిద్ధాంతానికి అనుగుణంగా ఎన్నికల బహిష్కరణకు నిర్ణయించినట్టు ఆ గ్రూపులు ప్రకటించాయి. మణిపూర్‌లో 2023 మే నుంచి మెయితీలు, కుకీల మధ్య జాతుల వైరం భగ్గుమని హింసాత్మక ఘటనలు చేటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 60,000 మందికి పైగా నిరాశ్రయిలయ్యారు.