Tamil Nadu: ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య.. స్పందించిన మాయావతి
ABN , Publish Date - Jul 06 , 2024 | 01:53 PM
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు కె. ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్యపై ఆ పార్టీ అధినేత్రి మాయావతి స్పందించారు. ఈ దారుణ హత్య నేపథ్యంలో శాంతియుతంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆమె సూచించారు.
లఖ్‌నవూ, జులై 07: తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు కె. ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్యపై ఆ పార్టీ అధినేత్రి మాయావతి స్పందించారు. ఈ దారుణ హత్య నేపథ్యంలో శాంతియుతంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆమె సూచించారు. ఈ దారుణ హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వానికి మాయావతి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన చోటు చేసుకోవడం విచారకరమన్నారు. ఇటువంటి ఘటన జరగడం బాధాకరమని తెలిపారు.
ఆదివారం చెన్నైలో ఆర్మ్‌స్ట్రాంగ్ భౌతిక కాయానికి నివాళులర్పించి.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తానని మాయవతి పేర్కొన్నారు. అయితే తమిళనాడులో పార్టీ కోసం అంకితభావంతో, కష్టించి పని చేసే బీఎస్పీ నేత కె.ఆర్మ్ స్ట్రాంగ్ దారుణ హత్యకు గురయ్యారన్నారు. ఆయన తన నివాసం బయట ఈ ఘటన చోటు చేసుకుందని వివరించారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా విచారం నెలకొందని వివరించారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా.. సత్వరమే కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి శనివారం తన ఎక్స్ వేదికగా మాయావతి సూచించారు.
శుక్రవారం రాత్రి పెంరంబుర్‌లో తన నివాసం బయట కార్యకర్తలతో మాట్లాడుతున్న ఆర్మ్‌స్ట్రాంగ్‌పై ఆగంతకులు ఒక్కసారిగా కత్తులతో దాడి చేసి అత్యంత పాశవికంగా నరికి చంపారు. ఫుడ్ డెలివరి బాయ్స్ డ్రస్ వేసుకుని వీరంతా ఆరు బైకులపై వచ్చారని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు. మరోవైపు ఆర్మ్ స్ట్రాంగ్ దారుణ హత్య నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగాయి.
ఈ హత్యను సీబీఐకి అప్పగించాలని వారంతా డిమాండ్ చేశారు. అయితే ఈ హత్యకు సంబంధించి ఆరుగురు అనుమానితులను అరెస్ట్ చేశామని చెన్నై అడిషనల్ కమిషనర్ అస్రా గార్గ్ వెల్లడించారు. ఇక ఈ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన వారు నిజమైన నిందితులు కాదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇంకోవైపు ఈ హత్యపై తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ దారుణ హత్య తనను షాక్‌కు గురి చేసిందన్నారు. ఈ హత్య కేసు దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ హత్య కేసులో పలువురు నిందితులను గత రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. ఆర్మ్‌స్ట్రాంగ్ మృతి పట్ల ఆయన కుటుంబానికి, పార్టీకి తన ప్రగాఢ సానుభూతిని సీఎం తెలియజేశారు. దైర్యంగా ఉండాలని ఆయన బంధువులు, స్నేహితులకు సూచించారు. ఈ ఘటనలో నిందితులను చట్ట ప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు సీఎం స్టాలిన్ ఈ సందర్భంగా వివరించారు.
For Latest News and National News click here