Share News

ఔషధం కాదు.. విషం!

ABN , Publish Date - Oct 27 , 2024 | 03:36 AM

అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడాల్సిన ఔషధాలు ఇప్పుడు విషంగా మారి ప్రజలు ప్రాణాలు తీస్తున్నాయి. దేశంలో నాసిరకం, నకిలీ మందులు విచ్చలవిడిగా చెలామణీ అవుతున్నాయి.

ఔషధం కాదు.. విషం!

  • కాల్షియం, విటమిన్‌ డీ3, పారాసిటమాల్‌ మాత్రలు నాసిరకం

  • 49 మందులు నాణ్యత పరీక్షల్లో విఫలం: సీడీఎ్‌ససీవో

న్యూఢిల్లీ, అక్టోబరు 26: అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడాల్సిన ఔషధాలు ఇప్పుడు విషంగా మారి ప్రజలు ప్రాణాలు తీస్తున్నాయి. దేశంలో నాసిరకం, నకిలీ మందులు విచ్చలవిడిగా చెలామణీ అవుతున్నాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులకు సాధారణంగా వేసుకొనే పారాసిటమాల్‌ మాత్రల నుంచి కాల్షియం సప్లిమెంట్లు, విటమిన్‌ ట్యాబ్లెట్ల వరకూ నాసిరకంగానే ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా సేకరించిన దాదాపు 3వేల ఔషధాల నమూనాల్లో 49 మందులు నాణ్యతా ప్రమాణాలకు తగినట్లుగా లేవని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎ్‌ససీవో) వెల్లడించింది. సెప్టెంబరు నెలకు సంబంధించిన క్వాలిటీ రిపోర్టును ఆ సంస్థ తాజాగా విడుదల చేసింది. నిర్ధారించిన నాణ్యతా ప్రమాణాలు లేని మందుల్లో నొప్పి నివారణకు విస్తృతంగా వినియోగించే పారాసిటమాల్‌ ట్యాబ్లెట్లు (కర్ణాటక యాంటీబయాటిక్స్‌ అండ్‌ ఫార్మస్యూటికల్స్‌ లిమిటెడ్‌), మెట్రోనిడాజోల్‌ (హిందుస్థాన్‌ యాంటీబయాటిక్స్‌), డెంపెరిడోన్‌ (రెయిన్‌బో లైఫ్‌ సైన్సెస్‌) ట్యాబ్లెట్లతో మాటు ఆక్సిటోసిన్‌ (పుష్కర్‌ ఫార్మా) ఇంజెక్షన్లు ఉన్నాయి.

వీటితో పాటు మెట్‌ఫార్మిన్‌ (స్విస్‌ బయోటెక్‌ పేరెంటరల్స్‌), కాల్షియం 500 ఎంజీ, విటమిన్‌ డీ3 (లైఫ్‌ మాక్స్‌ క్యాన్సర్‌ లేబొరేటరీస్‌), పీఏఎన్‌ 40 (ఆల్కెమ్‌ ల్యాబ్స్‌) మాత్రలు సైతం ఈ జాబితాలో ఉన్నాయి. ఎక్కువమంది వినియోగించే మందులు నాణ్యతా ప్రమాణాలు అందుకోవడంలో విఫలం కావడంపై సీడీఎ్‌ససీవో ఆందోళన వ్యక్తం చేసింది. నాసిరకంగా ఉన్నట్లు గుర్తించిన ఈ 49 మందులను రీకాల్‌ చేసినట్లు పేర్కొంది. మరోవైపు వైద్యులు సాధారణంగా సూచించే కాల్షియం సప్లిమెంట్‌ షెల్కాల్‌ 500, యాంటాసిడ్‌ పీఏన్‌ డీ, ప్రొస్టేట్‌ చికిత్సలో ఉపయోగించే యూరిమాక్స్‌-డీ, ఆస్టియోపోరోసిస్‌ బాధితులకు ఇచ్చే డెకా-డ్యూరబోలిన్‌ 25 ఇంజెక్షన్‌ నకిలీవని సీడీఎ్‌ససీవో నివేదిక తెలిపింది.

Updated Date - Oct 27 , 2024 | 03:36 AM