Miss World 2023: 28 ఏళ్ల తర్వాత ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు.. భారత్ తరఫున ఈ భామకు ఛాన్స్
ABN , Publish Date - Feb 16 , 2024 | 04:13 PM
ఫెమినా మిస్ ఇండియా 2022 టైటిల్ విజేతగా నిలిచిన సినీ శెట్టి రాబోయే మిస్ వరల్డ్ 2023 పోటీలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తుంది.
28 ఏళ్ల విరామం తర్వాత ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అందాల పోటీలు దేశానికి తిరిగి వచ్చాయి. ఈ సందర్భంగా మిస్ వరల్డ్ 2023కి ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం సిద్ధమవుతోంది. ఈ మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ పోటీలు నవంబర్‌లో జరుగుతాయని అంచనా వేస్తున్నారు. అయితే తేదీలు ఇంకా ఖరారు కాలేదు. కానీ రాబోయే మిస్ వరల్డ్ 2023 పోటీలకు భారతదేశం తరపున మిస్ ఇండియా 2022 టైటిల్ విజేతగా నిలిచిన సిని శెట్టి(sini shetty) ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ అవకాశం గురించి శెట్టి మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన తోటి పోటీదారులకు భారతదేశం విభిన్న సంప్రదాయాలు, విలువలను ప్రదర్శించడానికి మంచి అవకాశమని చెప్పారు.
మిస్ ఇండియా సిని శెట్టి 2000 సంవత్సరంలో ముంబైలో జన్మించారు. ఆమె కర్ణాటకకు చెందినప్పటికీ. 2022లో మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్నారు. సిని మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆమె దేశ, విదేశాలలో ఎక్కువగా పర్యటించడానికి ఇష్టపడతారు. సినీ తండ్రి పేరు సదానంద్ శెట్టి, తల్లి పేరు హేమా శెట్టి. తండ్రి షికిన్ హోటల్స్ యజమానిగా ఉన్నారు. భారతదేశం చివరిసారిగా 1996లో ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది.
సినీ శెట్టి చిన్నప్పటి నుంచి చాలా కష్టపడేది. చదువులో టాపర్‌గా నిలవడమే కాకుండా స్కూల్, కాలేజీల్లో పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంది. సిని శెట్టికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నాలుగేళ్ల వయసు నుంచే డ్యాన్స్ చేయడం మొదలుపెట్టడం విశేషం. శెట్టి తన ప్రారంభ విద్యను ముంబైలోని సెయింట్ డొమినిక్ సావియో స్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత ఎస్‌కే సోమయ్య డిగ్రీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్, విద్యా విద్యా విహార్ నుంచి డిగ్రీ పట్టా తీసుకుంది. ఆమె చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ కోర్సు కూడా చేస్తోంది. సిని శెట్టి ప్రియాంక చోప్రాకు వీరాభిమాని. ప్రియాంక మిస్ వరల్డ్ 2000 కిరీటాన్ని గెలుచుకుంది. అప్పటి నుంచి సినీ ఆమెను అనుసరిస్తోంది.