Model Divya Pahuja: మోడల్ దారుణ హత్య.. ఆ ఫోటోలే కారణమా.. ఎవరు చేశారంటే?
ABN , Publish Date - Jan 04 , 2024 | 04:22 PM
గురుగ్రామ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. దివ్య పహుజా అనే 27 ఏళ్ల మోడల్ హత్యకు గురైంది. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో ఏడేళ్ల జైలుశిక్ష తర్వాత ఇటీవల బెయిల్‌పై బయటకొచ్చిన..
Model Divya Pahuja Case: గురుగ్రామ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. దివ్య పహుజా అనే 27 ఏళ్ల మోడల్ హత్యకు గురైంది. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో ఏడేళ్ల జైలుశిక్ష తర్వాత ఇటీవల బెయిల్‌పై బయటకొచ్చిన ఆమెను బుధవారం ఒక హోటల్‌లో కాల్చి చంపేశారు. ఆ హోటల్ యజమాని అభిజీత్ సింగ్ ఆమెను కాల్చి చంపినట్టు తేలింది. దివ్యను హతమార్చిన తర్వాత ఆమె మృతదేహాన్ని మాయం చేసేందుకు నిందితుడు ప్రయత్నించాడు. ఇందుకు హోటల్‌లో పని చేసే హేమ్‌రాజ్, ఓంప్రకాష్‌లు సహకరించారని తేలింది.
ఈ హత్య సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి.. నిందితుడు అభిజీత్‌తో పాటు అతనికి సహకరించిన ఆ ఇద్దరు వ్యక్తుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. తనతో సన్నిహితంగా గడిపిన ఫోటోలను చూపించి దివ్య బెదిరింపులకు పాల్పడిందని, తన వద్ద నుంచి ఇప్పటికే చాలా డబ్బులు వసూలు చేసిందని అభిజీత్ పేర్కొన్నాడు. ఇప్పటికీ ఆ ఫోటోల్ని అడ్డం పెట్టుకొని తనని బెదిరిస్తుండటంతో.. ఆమెను హతమార్చానని అభిజీత్ ఆరోపించాడు. అయితే.. దివ్య కుటుంబం మాత్రం ఈ ఆరోపణల్ని తోసిపుచ్చింది. మరోవైపు.. పోలీసులు దివ్య పహుజా మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దివ్య, అభిజీత్ జనవరి 1వ తేదీన కలుసుకున్నారు. అతని హోటల్‌లోనే బస చేశారు. దివ్య తన కుటుంబంతో చివరిసారిగా జనవరి 2న ఉదయం 11:50 గంటలకు ఫోన్‌లో మాట్లాడింది. ఆ తర్వాత ఆమెని సంప్రదించడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. ఆమె హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. అభిజీత్ తన హోటల్‌లోనే ఆమెను చంపేసి, ఉద్యోగుల సహాయంతో మృతదేహాన్ని మాయం చేశాడు.
సీసీటీవీ ఫుటేజీలను గమనించగా.. హేమ్‌రాజ్, ఓంప్రకాశ్ సహకారంతో దివ్య మృతదేహాన్ని అభిజీత్ తన బీఎండబ్ల్యూ కారులో పెట్టారు. అనంతరం ఇద్దరు సహచరులను పిలిచి.. కారుని వాళ్లకు ఇచ్చి.. మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతాల్లో పారేయాల్సిందిగా ఆదేశాలిచ్చాడు. అభిజీత్ చెప్పినట్టుగానే వాళ్లు దివ్య మృతదేహాన్ని ఓ తెలియని ప్రదేశంలో పారేశారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో.. పోలీసులు దివ్య మృతదేహాన్ని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.