Share News

Mumbai : అనంత్‌-రాధిక జంటకు మోదీ ఆశీర్వాదం

ABN , Publish Date - Jul 14 , 2024 | 03:40 AM

ముకేశ్‌ అంబానీ ఇంట జరుగుతున్న కళ్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. వివాహ వేడుకల్లో భాగంగా ‘శుభ్‌ఆశీర్వాద్‌’ పేరిట శనివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

 Mumbai : అనంత్‌-రాధిక జంటకు మోదీ ఆశీర్వాదం

  • అంబానీల వివాహ వేడుకకు హాజరైన ప్రధాని.. శిందే, అఖిలేశ్‌ కూడా

ముంబై, జూలై 13: ముకేశ్‌ అంబానీ ఇంట జరుగుతున్న కళ్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. వివాహ వేడుకల్లో భాగంగా ‘శుభ్‌ఆశీర్వాద్‌’ పేరిట శనివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముంబైలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా హాజరయ్యారు. నూతన వధూవరులు అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ను ఆశీర్వదించారు.

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడణవీస్‌, అజిత్‌ పవార్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ తదితర ప్రముఖులు శనివారం జరిగిన వేడుకలకు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితోపాటు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, క్రికెటర్లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంత్‌-రాధిక వివాహ రిసెప్షన్‌ ఆదివారం జరగనుంది.


ఆర్‌బీఐ నివేదికతో ప్రతిపక్షాల నోటికి తాళం

ఉద్యోగాల కల్పనపై ఆర్‌బీఐ ఇటీవల విడుదల చేసిన నివేదిక నిరుద్యోగం పేరిట అవాస్తవాలను ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల నోటికి తాళం వేసిందని ప్రధాని మోదీ అన్నారు. ముంబైలో చేపట్టిన రూ.29,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శనివారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్‌బీఐ నివేదిక ప్రకారం గత నాలుగేళ్లలో దేశంలో దాదాపు 8 కోట్ల కొత్త ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. ఈ గణాంకాలు ప్రతిపక్షాల నోటికి తాళం వేశాయని, దేశాభివృద్ధిని వ్యతిరేకిస్తున్న వారిని ప్రజలు ముందు నిలబెట్టాయని మోదీ అన్నారు. అలాగే, ముంబైలోని అటల్‌ సేతు వంతెన విషయంలో ప్రతిపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని మోదీ మండిపడ్డారు. అటల్‌ సేతు వంతెనపై ప్రతి రోజు 20 వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయని, ప్రతి రోజు పెద్ద ఎత్తున ఇంధన ఆదా జరుగుతోందని వివరించారు.

Updated Date - Jul 14 , 2024 | 03:41 AM