New Delhi : భీమా-కోరేగావ్ కేసులో నౌలఖాకు బెయిల్
ABN , Publish Date - May 15 , 2024 | 03:30 AM
మహారాష్ట్రకు చెందిన భీమా- కోరెగావ్ కేసులో సామాజిక కార్యకర్త గౌతం నౌలఖాకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.
న్యూఢిల్లీ, మే 14 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రకు చెందిన భీమా- కోరెగావ్ కేసులో సామాజిక కార్యకర్త గౌతం నౌలఖాకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఆయనకు గతంలో బాంబే హైకోర్టు బెయిల్ ఇవ్వగా, సుప్రీంకోర్టు దానిపై స్టే విధించి గృహ నిర్బంధానికి పరిమితం చేసింది.
మంగళవారం ఆ స్టే ఉత్తర్వులను ఎత్తివేస్తూ జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ఎస్‌విఎన్ భట్టిల ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. అయితే గృహనిర్బంధ సమయంలో పోలీసులు భద్రత కల్పించినందున ఖర్చుల కింద రూ.20 లక్షల మొత్తాన్ని చెల్లించాలని సూచించింది.
ఈ కేసు విచారణ పూర్తయ్యేందుకు ఏళ్లకు ఏళ్లు పడుతుందని ధర్మాసనం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. నాలుగేళ్లుగా జైలులో ఉన్నా ఇంతవరకూ నౌలఖాపై ఆరోపణలే ఖరారు చేయలేదని గుర్తు చేసింది