Maharashtra Assembly Elections: నేను ఎన్సీపీ క్యాండిడేట్‌ను, కానీ మహాయుతి నాకు వ్యతిరేకం: నవాబ్ మాలిక్
ABN , Publish Date - Nov 03 , 2024 | 08:39 PM
మహారాష్ట్రలోని అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మహారాష్ట్రలో ప్రధానంగా ``మహాయుతి``, ``మహా వికాస్ అఘాడీ`` కూటములు పోటీ పడుతున్నాయి. అయితే మాన్‌ఖుర్ద్ శివాజీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో మాత్రం మహాయుతి కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి.
మహారాష్ట్రలోని అసెంబ్లీ ఎన్నికలు (Maharashtra Assembly Elections) సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మహారాష్ట్రలో ప్రధానంగా ``మహాయుతి``, ``మహా వికాస్ అఘాడీ`` కూటములు పోటీ పడుతున్నాయి. మహాయుతి (Mahayuti) తరఫున బీజేపీ, ఏక్‌నాథ్ షిండే అధ్యక్షతన ఉన్న శివసేన, అజిత్ పవార్ నడుపుతున్న ఎన్‌సీపీ కూటమిగా ఉన్నాయి. మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే నడుపుతున్న శివసేన, శరద్ పవర్ నడుపుతున్న ఎన్‌సీపీ ఉన్నాయి. రెండు కూటములు హోరాహోరీగా ఎన్నికల బరిలో తలపడుతున్నాయి. అయితే మాన్‌ఖుర్ద్ శివాజీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో మాత్రం మహాయుతి కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి.
మాన్‌ఖుర్ద్ శివాజీ నగర్ నుంచి ఎన్సీపీ (అజిత్‌పవార్ వర్గం) అభ్యర్థిగా బరిలో దిగుతున్న నవాబ్ మాలిక్ (Nawab Malik) తరఫున ప్రచారం నిర్వహించేందుకు బీజేపీ నిరాకరించింది. నవాబ్ మాలిక్‌కు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు రావడమే దానికి కారణం. ఇక, మహాయుతి కూటమిలోనే ఉన్న ఏక్‌నాథ్ షిండే అధ్యక్షతన ఉన్న శివసేన అయితే స్వయంగా మరో అభ్యర్థిని బరిలోకి నిలిపింది. దీంతో నవాబ్ మాలిక్ ఒంటరి అయ్యారు. అయితే బీజేపీ, శివసేన తనను వ్యతిరేకించినా అభ్యంతరం లేదని, తాను భారీ మెజారిటీతో గెలుస్తానని మాలిక్ ధీమా వ్యక్తంచేశారు.
``నేను అజిత్ పవార్‌తో ఉన్నాను. ఆయన నన్ను తన పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిపారు. మహాయుతి కూటమికి చెందిన ఇతర పార్టీలు నన్ను సపోర్ట్ చేయడం లేదు. నాకు వ్యతిరేకంగా బరిలోకి దిగాయి. నేను కూడా ఆ పార్టీలతో ఫైట్ చేస్తాను. ఈ ఎన్నికల్లో అజిత్ పవార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు హోరాహోరీ పోరు సాగుతోంది. ఏ కూటమికి మెజారిటీ వస్తుందో చెప్పడం కష్టం. కాబట్టి అజిత్ పవార్ కచ్చితంగా కింగ్ మేకర్ అవుతారు`` అంటూ నవాబ్ మాలిక్ పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..