Share News

Taj Mahal: తాజ్‌మహల్‌పై పిచ్చి మొక్కలు.. ప్రమాదంలో వారసత్వ కట్టడం!

ABN , Publish Date - Sep 18 , 2024 | 07:46 PM

ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌‌‌ నిర్వహణలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ కట్టడాన్ని కాపాడుకోవడంలో ఆగ్రా అధికారులు విఫలమవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Taj Mahal: తాజ్‌మహల్‌పై పిచ్చి మొక్కలు.. ప్రమాదంలో వారసత్వ కట్టడం!

ఢిల్లీ: ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌‌‌ నిర్వహణలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ కట్టడాన్ని కాపాడుకోవడంలో ఆగ్రా అధికారులు విఫలమవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం ఆగ్రా పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు తాజ్ మహాల్ ప్రధాన డూమ్‌లోంచి నీరు లీక్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. నీరంతా సమాధి చుట్టూ వచ్చి చేరాయి. ఇది జరిగి వారం గడవకముందే.. తాజ్‌మహల్‌ పైన పిచ్చి మొక్కలు పెరిగిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతోంది.


రెండు పాలరాయి బండలు, అచ్చు మధ్య ఒక మొక్క పెరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. తాజ్‌మహల్‌పై మొక్కలు గత కొంత కాలంగా పెరుగుతున్నాయని.. అధికారులు పట్టించుకోవట్లేదని టూరిస్టులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కాలుష్యంతో తాజ్‌మహల్ సహజ రంగును కోల్పోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోపక్క నీటి లీకేజీ సమస్యా ఉంది. తాజాగా.. మొక్కలు పెరగడం సందర్శకులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఆగ్రా టూరిజం గిల్డ్ ప్రెసిడెంట్ రాజీవ్ సక్సేనా వీడియోపై స్పందించారు. "ASI ప్రతి సంవత్సరం తాజ్ మహల్ సంరక్షణ కోసం రూ.3 - 4 కోట్లు ఖర్చు చేస్తుంది. ఇలాంటి సంఘటనలు ఏఎస్ఐ ప్రతిష్టను దెబ్బతీస్తాయి. తాజ్‌మహల్‌కు వెంటనే మరమ్మతులు చేయాలి" అని ఆయన డిమాండ్ చేశారు.


తొలగింపజేస్తాం..

పురావస్తు శాస్త్రవేత్త, పర్యవేక్షకుడు డాక్టర్ రాజ్‌కుమార్ పటేల్ ఈ అంశంపై స్పందించారు. "మా బృందం ప్రతి శుక్రవారం తాజ్‌మహల్ గోడలను శుభ్రం చేసి, పిచ్చి మొక్కలను తొలగిస్తుంది. మొక్కలు పెరిగిన ప్రాంతం చాలా ఎత్తులో ఉంది. దీంతో అది మా దృష్టికి రాలేదు. వీలైనంత త్వరలో మొక్కలను తొలగింపజేస్తాం" అని తెలిపారు. తాజ్‌మహల్‌పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పర్యాటకులు కోరుతున్నారు.

For Latest News and National News click here

Updated Date - Sep 18 , 2024 | 08:50 PM