Viral Video: రోటీలపై ఉమ్మేస్తున్న వ్యక్తి.. సోనూసూద్‌కి పార్శిల్ చేయాలని నెటిజన్లు ఫైర్
ABN , Publish Date - Jul 20 , 2024 | 06:26 PM
కరోనా లాక్‌డౌన్ సమయంలో రియల్ హీరోగా పేరొందిన నటుడు సోనూసూద్ ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. రొట్టెలు చేసే ఓ వంటమనిషిని మద్దతు ప్రకటించడం వల్లే..
కరోనా లాక్‌డౌన్ (Corona Lockdown) సమయంలో రియల్ హీరోగా పేరొందిన నటుడు సోనూసూద్ (Sonu Sood) ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. రొట్టెలు చేసే ఓ వంటమనిషిని మద్దతు ప్రకటించడం వల్లే.. అతనిపై విమర్శలు వెల్లెవెత్తుతున్నాయి. మానవత్వం పేరుతో హితవు పలుకుతూ.. తనని తాను రాముడితో పోలుస్తున్న సోనూసూద్‌కే.. ఆ రొట్టెలు పార్శిల్ చేయాలని కౌంటర్లు వేస్తున్నారు. కన్వర్ యాత్ర రూల్స్‌పై చెలరేగిన వివాదంలో సోనూసూద్ జోక్యం చేసుకొని.. ఇప్పుడిలా విమర్శలపాలవుతున్నాడు. అసలు ఏం జరిగిందంటే..
కన్వర్ యాత్ర రూల్స్
ప్రతిఏటా శివభక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో కన్వర్ యాత్ర నిర్వహిస్తుంటారు. జులై 22వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకూ ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే.. ఈ యాత్ర మార్గంలో ఉన్న హోటళ్ల ముందు యజమానులు తమ పేర్లతో బోర్డులతో ఉంచాలని పోలీసులు ఆదేశించారు. అయితే.. ఈ ఆదేశాలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఈ ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని రాజకీయ నేతలూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. ఈ ఆదేశాలిచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
సోనూసూద్ వివాదాస్పద ట్వీట్
ఈ క్రమంలోనే సోనూసూద్ కూడా స్పందించాడు. ‘మానవత్వం’ పేరుతో ప్రతి షాప్ ముందు ఒక నేమ్ ప్లేట్ ఉండాలని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు. ఇందుకు ఓ నెటిజన్ బదిలస్తూ.. ఒక వీడియోని షేర్ చేశాడు. ఆ వీడియోలో ఒక వంటమనిషి.. రోటీలపై ఉమ్మివేస్తూ, వాటిని వండటాన్ని మనం గమనించవచ్చు. ఈ వీడియోని షేర్ చేస్తూ.. ‘‘ఈ రోటీలను సోనూసూద్‌కే పార్శిల్ చేయండి, సోదరభావం ఉంటుంది’’ అని పోస్టు పెట్టాడు. దీనికి కూడా సోనూసూద్ బదులిస్తూ.. రాముడికి శబరి ఓ ఎంగిలి పండు తినిపించిన అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చాడు.
‘‘సాక్షాత్తూ మన శ్రీరాముడే శబరి ఇచ్చిన ఎంగిలి పండు తిన్నాడు. అలాంటిది.. నేను ఎందుకు తినను? అహింస ద్వారా హింసను ఓడించొచ్చు సహోదరా! మానవత్వం మాత్రమే చెక్కుచెదరకుండా ఉండాలి’’ అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. రాముడే ఎంగిలి తిన్నప్పుడు.. మనం తినలేమా? అనే అభిప్రాయాన్ని సోనూ ఆ ట్వీట్‌లో వ్యక్తపరిచాడు. అయితే.. నెటిజన్లకు మాత్రం ఆ ట్వీట్ నచ్చకపోవడంతో అతనిని ట్రోల్ చేస్తున్నారు. ఒక తప్పుని మరీ ఇంతలా సమర్థించవద్దని.. ఓ తప్పుని సరైనదని చూపించడం కోసం మీరు ప్రయత్నిస్తున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ఓ నెటిజన్ సోనూసూద్‌కి బదులిస్తూ.. ‘‘శబరి మాతా శ్రీరామ భక్తురాలు. ఆమె ద్వేషంతో పండ్లను ఎంగిలి చేసి ఇవ్వలేదు. అవి రుచికరంగా ఉన్నాయా? లేవా? అని తెలుసుకోవడం కోసం.. అమాయకత్వంతో రుచి చూసి శ్రీరాముడికి ఇస్తుంది. కానీ.. ఇక్కడ వీడియోలో చూపబడుతున్న వ్యక్తి తన కస్టమర్లపై ప్రేమ చూపించడం లేదు. ఇతర మతాల పట్ల అతను ద్వేషం చూపిస్తున్నట్లు ఉంది. అలాంటి వ్యక్తిని శబరి మాతతో పోలుస్తున్నావా? నువ్వొక మూర్ఖుడివి’’ అంటూ తారాస్థాయిలో మండిపడ్డాడు.
Read Latest National News and Telugu News