Acharya pramod krishnam: 6 ఏళ్లు కాదు, రాముడిలా 14 ఏళ్లు బహిష్కరించినా ఓకే
ABN , Publish Date - Feb 11 , 2024 | 03:54 PM
కాంగ్రెస్ పార్టీ తనపై బహిష్కరణ వేటు వేయడంపై ఆ పార్టీ నేత, ఆధ్యాత్మిక గురువు ఆచార్య ప్రమోద్ కృష్ణం సూటిగా స్పందించారు. రాముడు, జాతీయత విషయంలో తాను రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. రాముడు 14 ఏళ్లు వనవాసం చేశాడని, తనకు కూడా 6 ఏళ్లకు బదులు 14 ఏళ్లు బహిష్కరణ విధించాలని కోరుకుంటున్నానని అన్నారు.
సంబల్: కాంగ్రెస్ పార్టీ తనపై బహిష్కరణ వేటు వేయడంపై ఆ పార్టీ నేత, ఆధ్యాత్మిక గురువు ఆచార్య ప్రమోద్ కృష్ణం (Acharya Pramod Krishnam) సూటిగా స్పందించారు. రాముడు, జాతీయత విషయంలో తాను రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. రాముడు 14 ఏళ్లు వనవాసం చేశాడని, తనకు కూడా 6 ఏళ్లకు బదులు 14 ఏళ్లు బహిష్కరణ విధించాలని కోరుకుంటున్నానని అన్నారు. క్రమశిక్షణారాహిత్యం, పార్టీ వ్యతిరేక వ్యాఖ్యల నేపథ్యంలో ఆరేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఆయనను బహిష్కరించింది.
''కాంగ్రెస్ పార్టీ పంపిన లేఖ విషయం మీడియా సంస్థల ద్వారా తెలిసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు ఆలేఖలో కేసీ వేణుగోపాల్ చెప్పారు. పార్టీ నుంచి తనకు విముక్తి ప్రసాదించినందుకు మొదటగా కాంగ్రెస్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. దీనితో పాటు, పార్టీకి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు చేశానో చెప్పమని అడుగుతున్నాను?'' అని కృష్ణం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. రాముడి పేరెత్తడం, అయోధ్యకు వెళ్లడం, ప్రాణప్రతిష్ఠ ఆహ్వానాన్ని అంగీకరించడం, శ్రీ కల్కి థామ్ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానిని కలవడం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు అవుతాయా? అని పార్టీ అధిష్ఠానాన్ని ఆయన ప్రశ్నించారు. 370వ అధికరణ రద్దు అంశంతో సహా పలు అంశాలపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలపై తాను విభేదించానని అన్నారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో డీఎంకే పోల్చినప్పుడు వారికి కాంగ్రెస్ నేతలు సపోర్ట్ చేయకుండా ఉండాల్సిందన్నారు. ఒకటి మాత్రం తాను స్పష్టంగా చెప్పదలచుకున్నానని, రాముడు, జాతీయత విషయంలో తాను రాజీపడనని అన్నారు. ఈరోజు తనకు పార్టీ నుంచి విముక్తి లభించినట్టు భావిస్తున్నానని చెప్పారు.
రాజీవ్‌గాంధీకి మాటిచ్చా...
పార్టీలో తనకు పలు అవమానాలు జరిగినప్పటికీ బతికున్నంత కాలం కాంగ్రెస్ పార్టీని వీడనని నాటి ప్రధాని రాజీవ్ గాంధీకి ఇచ్చిన మాటకు తాను కట్టుబడి ఉన్నట్టు ఆచార్య కృష్ణం తెలిపారు. ఏళ్ల తరబడి తనకు కాంగ్రెస్‌తో అనుబంధం ఉందన్నారు. ఇప్పట్నించి దేశాభివృద్ధి విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బాసటగా ఉంటానని అన్నారు. ఫిబ్రవరి 19న జరిగే శ్రీ కల్కి థామ్ ఫౌండేషన్ సెర్మనీకి ప్రధాని హాజరు కానుండటం తనకు గర్వంగా ఉందని, తన ఆహ్వానాన్ని మన్నించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సైతం కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.