Share News

అణ్వాయుధ వ్యతిరేక పోరుకు నోబెల్‌ శాంతి

ABN , Publish Date - Oct 12 , 2024 | 03:27 AM

‘‘అణ్వస్త్రాలు కాదు.. ప్రజలకు అన్నవస్త్రాలు కావాలి’’ అంటూ అణ్వాయుఽధాలకు వ్యతిరేకంగా పోరు సల్పుతున్న జపాన్‌కు చెందిన ‘నిహాన్‌ హిడాంక్యో’ సంస్థను ప్రపంచ ప్రఖాత నోబెల్‌ శాంతి పురస్కారం వరించింది.

అణ్వాయుధ వ్యతిరేక పోరుకు నోబెల్‌ శాంతి

  • జపాన్‌కు చెందిన ‘నిహాన్‌ హిడాంక్యో’ సంస్థ ఎంపిక

  • హిరోషిమా బాధితుల పక్షాన ఆ సంస్థ ఉద్యమం

  • అణ్వాయుధాలు కాదు.. అన్నవస్త్రాల కోసం పోరు

  • శాంతి కోసం తపిస్తున్న వారికి ఈ గుర్తింపు

  • నోబెల్‌ కమిటీ ప్రకటన

  • జపాన్‌కు చెందిన నిహాన్‌ హిడాంక్యోను

  • వరించిన 2024-నోబెల్‌ శాంతి పురస్కారం

ఓస్లో, అక్టోబరు 11: ‘‘అణ్వస్త్రాలు కాదు.. ప్రజలకు అన్నవస్త్రాలు కావాలి’’ అంటూ అణ్వాయుధాలకు వ్యతిరేకంగా పోరు సల్పుతున్న జపాన్‌కు చెందిన ‘నిహాన్‌ హిడాంక్యో’ సంస్థను ప్రపంచ ప్రఖాత నోబెల్‌ శాంతి పురస్కారం వరించింది. అమెరికా జరిపిన అణుబాంబు దాడులతో అతలాకుతలమైన హిరోషిమా, నాగసాకి బాధితుల పక్షాన ‘నిహాన్‌ హిడాంక్యో’ పోరాడుతోంది. అంతేకాదు, ప్రపంచ దేశాలు అణ్వాయుధ వినియోగానికి దూరంగా ఉండాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు సైతం నిర్మించింది. హిరోషిమా, నాగసాకిలో అణుబాంబు దాడుల కారణంగా జీవచ్ఛవాలుగా మారి బతుకులీడుస్తున్న వందల మంది బాధితుల జీవితగాధలను ప్రపంచానికి వివరిస్తూ.. ప్రజలకు కావాల్సింది అణుయుద్ధాలు కాదని, అన్నవస్త్రాలేనని ‘నిహాన్‌ హిడాంక్యో’ చాటి చెబుతోంది. ఈ సంస్థ చేస్తున్న కృషిని గుర్తిస్తూ నోబెల్‌ కమిటీ శుక్రవారం 2024-శాంతి పురస్కారాన్ని ‘నిహాన్‌ హిడాంక్యో’కు ప్రదానం చేసింది. ఈ సందర్భంగా నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీ చైర్మన్‌ జార్గెన్‌ వాట్నే మాట్లాడుతూ.. ‘‘అణ్వాయుధాల వినియోగాన్ని నిషేధించాలన్న డిమాండ్‌తో ఈ సంస్థ తీవ్రస్థాయిలో పోరాడుతోంది అందుకే శాంతి పురస్కారాన్ని అందిస్తున్నాం. అణ్వాయుధ వినియోగ నిషేధంపై ఒతిడి కూడా పెరుగుతోంది’’ అని తెలిపారు.

‘‘ఆనాడు ప్రాణాలతో బయటపడిన బాధితలందరూ.. శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారు. మానసికంగా వారిని ఆనాటి జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ శాంతి కోసం వారెంతో ఆశతో తమ అనుభవాలను పంచుకుంటున్నారు. అందుకే వారిని శాంతి పురస్కారంతో గౌరవిస్తున్నాం’’ అని కమిటీ సభ్యుడు వాట్నే ఫ్రిడ్నెస్‌ వ్యాఖ్యానించారు. ‘‘అణ్వాయుధాలను ప్రయోగిస్తామంటూ కొందరు చేస్తున్న ప్రకటనలు అంతర్జాతీయంగా ఒత్తిడిని పెంచుతున్నాయనేది సుస్పష్టం. అందుకే అణ్వాయుధ వినియోగానికి వ్యతిరేకంగా కూడా ఒత్తిడిలు పెరుగుతున్నాయి.


మానవాళి మనుగడ కోసం దీనిని అంతర్జాతీయ సమాజం సమర్థించాల్సి ఉంది’’ అని చెప్పారు. ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ప్రయోగిస్తామంటూ రష్యా చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. శాంతి పురస్కార ప్రకటన చేస్తున్న సమయంలో సిటీ హాల్‌లో ఉన్న హిడాంక్యో సంస్థ హిరోషిమా శాఖ చైర్‌పర్సన్‌ టొమొయూకి మిమాకి.. ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. జలజలా రాలుతున్న కన్నీటి నడుమ.. ‘‘ఇది నిజమా? నమ్మలేకున్నా!!’’ అని బిగ్గరగా అరిచారు.

  • మంచి సందేశం: ఈయూ

హిడాంక్యో సంస్థకు నోబెల్‌ శాంతి పురస్కారం అందించడాన్ని ఈయూ కమిషన్‌ అధ్యక్షుడు ఉర్సులా వాండెర్‌ లేయెన్‌ స్వాగతించారు. ఇది మంచి సందేశమని పేర్కొన్నారు. గతంలో కూడా అణ్వాయుధాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సంస్థలకు నోబెల్‌ శాంతి పురస్కారాలు లభించాయి. అణ్యాయుధాలను నిర్మూలించే అంతర్జాతీయ ప్రచార సంస్థకు 2017లో, అంతర్జాతీయ రాజకీయాల్లో అణ్వాయుధాల అంశాన్ని పూర్తిగా తీసేయాలన్న డిమాండ్‌తో జోసెఫ్‌ రాట్‌బ్లాట్‌, పుగ్వాష్‌ సదస్సులకు 1995లో శాంతి పురస్కారాలు దక్కాయి. 2023లో ఇరాన్‌ దేశానికి చెందిన ఉద్యమకారిణి నార్గెస్‌ మొహమ్మదీకి ఈ పురస్కారం ప్రకటించారు. మహిళా హక్కులు, ప్రజాస్వామ్యం, ఉరిశిక్షలకు వ్యతిరేకంగా నార్గెస్‌ అలుపెరుగని పోరాటం చేశారు. అనేకమార్లు జైలుకు కూడా వెళ్లారు. కాగా, ఈ సంవత్సరం మధ్యప్రాచ్యం, ఉక్రెయిన్‌, సూడాన్‌లలో నెలకొన్న యుద్ధాల నేపథ్యంలో ‘నిహాన్‌ హిడాంక్యో’ సంస్థకు శాంతి పురస్కారం అందించారు.


  • ఇదీ.. ‘శాంతి విల్లు’

నోబెల్‌ శాంతి పురస్కారాన్ని ఎవరికి అందించాలన్న విషయంపై ఆల్ర్ఫెడ్‌ నోబెల్‌ ఆనాడే విల్లురాసి పెట్టారు. దేశాల మధ్య సౌభ్రాతృత్వం కోసం, స్టాండింగ్‌ ఆర్మీలను తగ్గించడం, లేదా రద్దు చేయడం కోసం కృషి చేసేవారికి ఇవ్వాలని పేర్కొన్నారు. శాంతిని ప్రోత్సహించేవారికి ఈ పురస్కారాన్ని అందించాలని స్పష్టం చేశారు. నోబెల్‌ పురస్కారం అందుకున్న వ్యక్తులు లేదా సంస్థలకు రూ.8.92 కోట్ల(11 మిలియన్‌ స్వీడిష్‌ రొనార్లు) నగదును అందిస్తారు. ఇక, ఇతర నోబెల్‌ అవార్డుల విజేతలను స్టాక్‌హోమ్‌లో ఎంపిక చేయడంతోపాటు అక్కడే ప్రకటిస్తారు. కానీ, శాంతి పురస్కార గ్రహీతల ఎంపిక, ప్రకటన భిన్నంగా ఉంటుంది. ఈ పురస్కారం అందించేందుకు ఐదుగురు సభ్యుల నార్వేజియన్‌ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ ఓస్లోలో భేటీ అయి పురస్కార గ్రహీతను అనేక వడపోతల తర్వాత ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది నోబెల్‌ పురస్కారాల కార్యక్రమం సోమవారంతో ముగియనుంది. ఆ రోజు అర్థశాస్త్రంలో విశేష కృషి సల్పిన వారిని నోబెల్‌కు ఎంపిక చేస్తారు.

Updated Date - Oct 12 , 2024 | 03:27 AM