Naveen Patnaik: బీజేపీకి నా చేతులపై చర్చ ఎందుకు? కస్సుమని లేచిన నవీన్ పట్నాయక్
ABN , Publish Date - May 28 , 2024 | 09:44 PM
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను బీజేడీ నేత వీకే పాండియన్ 'కంట్రోల్' చేస్తు్న్నారంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలు, ఆయన విడుదల చేసిన వీడియో సంచలనమవుతోంది. దీనిపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఘాటుగా స్పందించారు.
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik)ను బీజేడీ (BJD) నేత వీకే పాండియన్ (VK pandian) 'కంట్రోల్' చేస్తు్న్నారంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ (Himanta Biswa Sarma) చేసిన వ్యాఖ్యలు, ఆయన విడుదల చేసిన వీడియో సంచలనమవుతోంది. దీనిపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఘాటుగా స్పందించారు. ''సమస్య కాని దానిని సమస్య చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య'' అంటూ మండిపడ్డారు.
సంచలన వీడియో...
ఒడిశా ముఖ్యమంత్రి ఇటీవల ఒక బహిరంగ సభలో మాట్లాడుతుండగా ఆయన ఎడమ చేయి వణుకుతుండటం వీడియోకి చిక్కింది. సీఎం పక్కనే ఉన్న ఒడిశా మాజీ ప్రభుత్వ అధికారి వీకే పాండియన్ వెంటనే పట్నాయక్ చేతిని దాచే ప్రయత్నం చేశారు. ఈ వీడియోను హిమంత బిశ్వ శర్మ తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో షేర్ చేశారు. రాష్ట్రం భవిష్యత్తు తనకు ఆందోళన కలిగిస్తోందని, నవీన్ బాబు (సీఎం) చేతి కదలికలను కూడా వీకే పాండియన్ కంట్రోల్ చేస్తున్నారని శర్మ వ్యాఖ్యానించారు. తమిళనాడుకు చెందిన మాజీ బ్యూరోక్రాట్ ఒడిశా భవిష్యత్తును నిర్ణయించనుండటం ఊహకు కూడా అందడం లేదని, ఒడిశా పగ్గాలను తిరిగి ప్రజలకే అప్పగించేందుకు బీజేపీ కృతనిశ్చయంతో ఉందని శర్మ కామెంట్ చేశారు.
చేతికదలికలపై చర్చా?
కాగా, అసోం సీఎం శర్మ వ్యాఖ్యలపై నవీన్ పట్నాయక్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సమస్య కాని దానిని సమస్య చేయడం బీజేపీకి బాగా తెలుసునని, అందుకే తన చేతుల గురించి చర్చ లేవనెత్తారని తప్పుపట్టారు. ఓట్ల కోసం బీజేపీ చేస్తున్న కుయుక్తులు ఎంతమాత్రం పనిచేయవని స్పష్టం చేశారు.