Odisha: సీఎం ప్రమాణ స్వీకారం.. రేపు మధ్యాహ్నం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు
ABN , Publish Date - Jun 11 , 2024 | 01:44 PM
తాజాగా జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతుంది.
భువనేశ్వర్, జూన్ 11: తాజాగా జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతుంది. అందులోభాగంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం భువనేశ్వర్‌లో సమావేశమవుతున్నారు. ఈ సమావేశానికి న్యూఢిల్లీ నుంచి పరిశీలకులుగా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, భుపేంద్రయాదవ్ హాజరవుతున్నారు. ఈ రోజు సాయంత్రానికి ఒడిశా సీఎం పేరు ఖరారు చేయనున్నారు.
సీఎం రేసులో ముఖ్యంగా ముగ్గురు.. ఒడిశా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే మన్మోహన్ సమాల్, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే సురేశ్ పూజారీతోపాటు ఎమ్మెల్యే సింగ్ దేవ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక ఒడిశా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహుర్తం సైతం ఖరారు అయింది. జూన్ 12వ తేదీ భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. అందుకోసం ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.
అయితే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు.. పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం. ఇక సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులకు రేపు మధ్యాహ్నం.. ఒక పూట సెలవును ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల ఒడిశా అసెంబ్లీలోని మొత్తం 147 స్థానాలకు నాలుగు విడతలుగా ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో ఒడిశా ఓటరు.. బీజేపీకి పట్టం కట్టాడు. దీంతో బీజేడీ దశాబ్దాల పాటు సాగిన పాలనకు పుల్ స్టాప్ పడినట్లు అయింది.
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News