Share News

One Nation One Election: 'ఒకే దేశం.. ఒకే ఎన్నిక'.. కేంద్రానికి మీ అభిప్రాయం ఇలా చెప్పండి..

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:51 AM

'ఒకే దేశం.. ఒకే ఎన్నిక'.. అంశంపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ ప్రకటన విడుదల చేసింది హైలెవల్ కమిటీ. ప్రస్తుతం ఉన్న ఎన్నికల విధానంలో చేయాల్సిన మార్పులు, చేర్పులకు సంబంధించి సలహాలు, సూచనలు చేయాలని కోరింది ఈ కమిటీ.

One Nation One Election: 'ఒకే దేశం.. ఒకే ఎన్నిక'.. కేంద్రానికి మీ అభిప్రాయం ఇలా చెప్పండి..
One Nation One Election

న్యూఢిల్లీ, జనవరి 05: 'ఒకే దేశం.. ఒకే ఎన్నిక'.. అంశంపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ హైలెవల్ కమిటీ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న ఎన్నికల విధానంలో చేయాల్సిన మార్పులు, చేర్పులకు సంబంధించి సలహాలు, సూచనలు చేయాలని కోరింది. ఈ మేరకు జనవరి 15 లోగా తమ అభిప్రాయం తెలియజేయాల్సిందిగా ప్రజలను కోరింది.

'ఒకే దేశం-ఒకే ఎన్నిక' నిర్వహణ సాధ్యాసాధ్యాలపై తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక హైలెవల్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ తన నివేదికను త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ప్రకటన విడుదల చేసింది. ప్రజలు https://onoe.gov.in/onoe-reports ద్వారా గానీ, ఈ-మెయిల్ ఐడీ sc-hlc@gov.in ద్వారా గానీ, పత్రికా ప్రకటనలో పేర్కొన్న అడ్రస్‌కు పోస్ట్ చేయడం ద్వారా తమ అభిప్రాయలను తెలియజేయవచ్చునని ప్రకటనలో పేర్కొంది.

'ఒకే దేశం.. ఒకే ఎన్నిక' అంశం సాధ్యాసాధ్యాలను కేంద్రం గత కొంతకాలంగా పరిశీలిస్తోంది. విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్ర ముందుకెళ్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేస్తూనే.. 2029 ఎన్నికలను లోక్‌సభ, శాసనసభలతోపాటు కలిపి నిర్వహించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యులతో గతేడాది సెప్టెంబర్ 2వ తేదీన హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ స్థానిక ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలను కలిపి నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది.

కాగా, ఒక దేశ ఎన్నికల కమిటీ మొదటి పూర్తి స్థాయి సమావేశం గతేడాది సెప్టెంబర్‌లో జరిగింది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీలో.. కాంగ్రెస్ లోక్‌సభ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి కూడా ఉన్నారు. అయితే, ఆయన ఈ కమిటీ నుండి వైదొలిగారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గులాం నబీ ఆజాద్, హరీష్ సాల్వే, ఎన్‌కే సింగ్, డా. సుభాష్ కశ్యప్, సంజయ్ కొఠారి ఉన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 01:28 PM