చిరు దేశం.. సింహనాదం
ABN , Publish Date - Aug 15 , 2024 | 04:37 AM
రెండు దేశాలు కొట్టుకుంటే యుద్ధం. ఒక దేశం వచ్చి మీద పడిపోతే దండయాత్ర. అలా రష్యా తమపై చేసిన దండయాత్రను ఉక్రెయిన్ ఇప్పుడు యుద్ధంగా మార్చింది! తమ మీదకొచ్చి పడిపోతున్న రష్యన్ సేనలను ఇన్నాళ్లుగా సమర్థంగా నిలువరిస్తున్న ఉక్రెయిన్.. ఇప్పుడు తెల్లటి త్రిభుజం(వైట్
యుద్ధ బీభత్సాన్ని రష్యన్లకూ పరిచయం చేస్తున్న ఉక్రెయిన్
సరిహద్దుల్లో రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోయి దాడులు
వారం క్రితమే కర్స్క్ ప్రాంతంలో 1000 చ.కి.మీ. ఆక్రమణ
తాజాగా బెల్గొరోడ్‌లో విధ్వంసం
రెండు దేశాలు కొట్టుకుంటే యుద్ధం. ఒక దేశం వచ్చి మీద పడిపోతే దండయాత్ర. అలా రష్యా తమపై చేసిన దండయాత్రను ఉక్రెయిన్ ఇప్పుడు యుద్ధంగా మార్చింది! తమ మీదకొచ్చి పడిపోతున్న రష్యన్ సేనలను ఇన్నాళ్లుగా సమర్థంగా నిలువరిస్తున్న ఉక్రెయిన్.. ఇప్పుడు తెల్లటి త్రిభుజం(వైట్ ట్రయాంగిల్) బొమ్మ ఉన్న యుద్ధట్యాంకులతో తమ సరిహద్దుల్లో ఉన్న రష్యా భూభాగంలో పలు ప్రాంతాలకు చొచ్చుకుపోతోంది. ‘ఆపరేషన్ వైట్ ట్రయాంగిల్’తో.. యుద్ధ భయాన్ని, బీభత్సాన్ని రష్యన్లకూ పరిచయం చేస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా తొలుత 1000 మందికి పైగా మెరికల్లాంటి సైనికులతో, యుద్ధట్యాంకులతో ఆగస్టు 6న.. రష్యా భూభాగంలోని కర్స్క్ ప్రాంతంలోకి చొచ్చుకుపోయి.. వెయ్యి చదరపు కిలోమీటర్ల మేర భూభాగాన్ని ఆక్రమించింది! 100 మంది రష్యా సైనికులను యుద్ధ ఖైదీలుగా అదుపులోకి తీసుకొంది. దీంతో పుతిన్ సర్కారు కిందటి శనివారం అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించింది. లక్షమందికి పైగా ప్రజలను అక్కణ్నుంచీ సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తాజాగా బెల్గొరోడ్ (రష్యా) ప్రాంతంలోని కొలోతిలోవ్కా ప్రాంతంలోకి ఉక్రెయిన్ సేనలు ప్రవేశించి విధ్వంసం సృష్టిస్తున్నాయి. కాగా.. బెల్గొరోడ్‌పై ఉక్రెయిన్ సేనల దాడి నేపథ్యంలో ఆ ప్రాంత గవర్నర్ గ్లాడ్‌కోవ్ అక్కడ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని తెలిపారు. 5000 మందికి పైగా చిన్నపిల్లలను సురక్షిత ప్రాంతాల్లోని శిబిరాల్లో ఉంచామని, 11 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని.. వేయి మంది వసతి కేంద్రాల్లో ఉంటున్నారని చెప్పారు.
అందుకే కర్స్క్ ఆక్రమణ..?
కర్స్క్ ప్రాంతం నుంచి రష్యా శతఘ్నులు, మోర్టార్లు, డ్రోన్లతోపాటు.. 100కు పైగా క్షిపణులు, 255 గ్లైడ్ బాంబులతో ఉక్రెయిన్‌పై 2000కు పైగా దాడులు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే.. రష్యా భూభాగాన్ని ఆక్రమించుకోవడం తమ లక్ష్యం కాదని, ఆ దేశ సేనలు కర్స్క్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్‌పై క్షిపణి దాడులు చేయకుండా అడ్డుకునేందుకే తమ సేనలు ఆ ప్రాంతంపైౖ పట్టు సాధించాయని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఇక.. రష్యా తమపై దాడికి దిగి దాదాపు 900 రోజులవుతున్న నేపథ్యంలో.. దేశప్రజల్లో స్ఫూర్తిని రగిలించడానికే తాము కర్స్క్ ఆపరేషన్ చేపట్టినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. పైకి అలా చెబుతున్నప్పటికీ ఉక్రెయిన్ లక్ష్యం రష్యాలోని ‘సుద్జా’ పట్టణమేనని.. రష్యా నుంచి ఉక్రెయిన్ గుండా యూరప్ దేశాలకు సహజవాయు సరఫరాలో కీలకమైన హబ్ అయిన ఆ పట్టణాన్ని ఉక్రెయిన్ ఇప్పటికే స్వాధీనం చేసుకుందని తెలుస్తోంది. ఇలా రష్యాలోని కొన్ని ప్రాంతాలపై పట్టు సాధించడం, 100మందికిపైగా రష్యన్ సైనికులను బందీలుగా పట్టుకోవడం ద్వారా.. రష్యాతో చర్చల్లో(అసలంటూ జరిగితే) బేరమాడే శక్తి ఉక్రెయిన్‌కు వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తలవంపులే!
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత.. రష్యాపై ఈ స్థాయి దాడి జరగడం, ఈ స్థాయిలో భూభాగం విదేశీ ఆక్రమణకు గురికావడం ఇదే మొదటిసారి. రష్యా 2014 నుంచి ఇప్పటిదాకా ఉక్రెయిన్‌లో 18ు భూభాగాన్ని(లక్ష చదరపు కిలోమీటర్లు) ఆక్రమించింది. ఈ ఏడాది ఇప్పటిదాకా 1175 చదరపు కిలోమీటర్లను ఆక్రమించినట్టు అమెరికాకు చెందిన ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద స్టడీ ఆఫ్ వార్’ అంచనా. గడిచిన 7నెలల్లో ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమించినంత భూమిని.. రష్యాలో ఆక్రమించడానికి ఉక్రెయిన్‌కు కేవలం వారం రోజులు పట్టడం గమనార్హం. ఇది తమకు తలవంపులుగా క్రెమ్లిన్ వర్గాలు భావిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఇన్నాళ్లుగా సమర్థిస్తున్న బెల్గొరోడ్‌వాసుల్లో చాలా మందికి ఇప్పుడు యుద్ధం ఎలా ఉంటుందో తెలిసి వచ్చిందని స్థానిక మహిళ ఒకరు తెలిపారు.