Rahul Gandhi : భారత్‌లోకి చైనా చొరబాటు
ABN , Publish Date - Sep 12 , 2024 | 05:36 AM
అమెరికా పర్యటనలో ఉన్న విపక్షనేత రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత భూభాగాన్ని చైనా 4వేల చదరపు కిలోమీటర్ల మేర ఆక్రమించిందని.. ఢిల్లీ ఎంత మేర విస్తరించి ఉందో..
4వేల చ.కి.మీ మేర చొచ్చుకు వచ్చింది.. ఢిల్లీ ఎంత ఉంటుందో అంతమేర లద్ధాఖ్‌లోకి
మోదీ ఎదుర్కోలేకపోయారు
వాషింగ్టన్‌లో రాహుల్ వ్యాఖ్యలు
దేశ ప్రతిష్టకు గాయం: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ/బెంగళూరు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): అమెరికా పర్యటనలో ఉన్న విపక్షనేత రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత భూభాగాన్ని చైనా 4వేల చదరపు కిలోమీటర్ల మేర ఆక్రమించిందని.. ఢిల్లీ ఎంత మేర విస్తరించి ఉందో.. అంత మేర లద్దాఖ్‌లో భారత నేలను చైనా దళాలు ఆక్రమించాయని పేర్కొన్నారు. బుధవారం వాషింగ్టన్‌లో ప్రెస్‌క్లబ్‌లో రాహుల్ మాట్లాడారు. భారత్‌లోకి చైనా చొరబాటు ఘోర ఉత్పాతం అని, చైనాను ప్రధాని మోదీ సరిగా ఎదుర్కోలేకపోయారని ఆరోపించారు. తమ భూభాగాన్ని 4వేల చ.కి.మీ పొరుగుదేశం ఆక్రమిస్తే అమెరికా ఏ రకంగా స్పందిస్తుంది? తాను అంతా బాగానే చేశానని ఏ అమెరికా అధ్యక్షుడైనా చెప్పి తప్పించుకోగలరా? అని ప్రశ్నించారు. కాగా దేశం మంచి స్థితికి చేరుకున్న తర్వాత రిజర్వేషన్ల రద్దును పరిశీలిస్తామని మంగళవారం చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో రాహుల్ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని.. తాను రిజర్వేషన్లను సమర్థిస్తానని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల పరిమితిని 50శాతానికి పైగా తీసుకెళ్తామని చెప్పారు. కాగా చైనా దురాక్రమణ అంటూ రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ అగ్రనేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రకటనలతో జనాన్ని రాహుల్ తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆయన మాటల్లో వాస్తవం లేదని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విమర్శించారు. మొహబ్బత్ (ప్రేమ) దుకాణాన్ని నడుపుతున్నానని ఇంతవరకూ చెప్పిన రాహుల్ అబద్ధాల దుకాణాలను తెరిచినట్లుందన్నారు. విదేశీ పర్యటనలో రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, ఆయన వ్యాఖ్యలు దేశ ప్రతిష్టను గాయపరిచాయని మండిపడ్డారు. దేశ వ్యతిరేక ప్రకటనలు చేస్తున్న రాహుల్ దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో చేతులు కలిపారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా విమర్శించారు.
జమ్మూ కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ దేశ వ్యతిరేక, రిజర్వేషన్ వ్యతిరేక ఎజెండాను సమర్థించడం, విదేశీ వేదికల్లో భారత వ్యతిరేక ప్రకటనలు చేయడం ద్వారా దేశ భద్రత, ప్రజల మనోభావాలకు రాహుల్ వ్యాఖ్యలు ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పడం ద్వారా కాంగ్రెస్ రిజర్వేషన్ వ్యతిరేక వైఖరి బయటపడిందని అన్నారు. బీజేపీ ఉన్నంతవరకూ రిజర్వేషన్లను రద్దు చేయడం కానీ, దేశ భద్రతతో ఎవరైనా చెలగాటమాడటాన్ని కానీ అనుమతించదని పేర్కొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాహుల్‌ను భారత వ్యతిరేక వేర్పాటువాదిగా అభివర్ణించారు. దేశ సమైక్యత, సమగ్రత, సామాజిక సామరస్యాన్ని ధ్వంసం చేసేందుకు, దేశాన్ని అంతర్యుద్ధం దిశగా నడిపించేందుకు ఆయన కంకణం కట్టుకున్నారని యోగి విమర్శించారు. ఇదిలా ఉండగా, కర్ణాటక సీఎం సిద్దరామయ్య ముడా వివాదంలో చిక్కుకుని.. సీఎం మార్పుపై చర్చ నడుస్తున్న నేపథ్యంలో.. రాహుల్‌గాంధీని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వాషింగ్టన్‌లో కలిశారు. దీనిపై రాజకీయంగా చర్చలు సాగుతున్నాయి. శివకుమార్ అమెరికా వెళ్లేముందు ఖర్గేకు లేఖ రాశారు. వ్యక్తిగత కారణాలతోనే అమెరికా వెళ్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
రాహుల్ వ్యాఖ్యలు ఖలిస్థాన్‌కు సమర్థనే
భారత్‌లో సిక్కుల మతస్వేచ్ఛ గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలను నిషేధిత ఉగ్రవాద సంస్థ సిఖ్క్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎ్‌ఫజే) సమర్థించింది. రాహుల్ వ్యాఖ్యలు ప్రత్యేక ఖలిస్థాన్ డిమాండ్‌ను సమర్థిస్తున్నాయని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ అన్నారు. వర్జీనియాలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ ‘సిక్కులు తలపాగాలు, కడియాలు ధరించవచ్చా, వారు గురుద్వారాకు వెళ్లగలుగుతున్నారా అనే దానిపైనే భారత్‌లో పోరాటం జరుగుతోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై పన్నూన్ సోషల్ మీడియాలో స్పందించారు. ‘భారత్‌లో సిక్కుల అస్తిత్వానికి ముప్పు గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు సాహసోపేతమైనవి, మార్గదర్శమైనవి మాత్రమే కాదు. ఇది ఖలిస్థాన్ స్థాపనకు పంజాబ్ ఇండిపెండెన్స్ రెఫరెండంను సమర్థించడంపై ఎస్‌ఎ్‌ఫజే వైఖరిని కూడా ధ్రువీకరిస్తుంది’ అని పన్నూన్ తెలిపారు.