Share News

Kolkata: మా కుమార్తె డైరీలో మూడు పేజీలు కనిపించట్లేదు.. ట్రైనీ వైద్యురాలి తల్లిదండ్రుల అనుమానాలు

ABN , Publish Date - Aug 23 , 2024 | 07:29 PM

తమ కుమార్తె డైరీలో మూడు పేజీలు కనిపించట్లేదని కోల్‌కతా(Kolkata) ట్రైనీ వైద్యురాలి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు పలు అనుమానాలు ఉన్నాయన్నారు.

Kolkata: మా కుమార్తె డైరీలో మూడు పేజీలు కనిపించట్లేదు.. ట్రైనీ వైద్యురాలి తల్లిదండ్రుల అనుమానాలు

కోల్‌కతా: తమ కుమార్తె డైరీలో మూడు పేజీలు కనిపించట్లేదని కోల్‌కతా(Kolkata) ట్రైనీ వైద్యురాలి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు పలు అనుమానాలు ఉన్నాయన్నారు.

‘‘మా కుమార్తెకు డైరీ రాయడమంటే చాలా ఇష్టం. రోజూ డైరీ రాసేది. వాటిల్లో కొన్ని పేజీలు కనిపించడం లేదు.. డైరీలో కనీసం మూడు పేజీలు మాయమయ్యాయి. దీనిపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఆ పేజీల్లో ఏముందో మాకు తెలియదు. ఆమె బంగారు పతకం సాధించాలని కలలు కనింది. ఇదే విషయాన్ని డైరీలోని ఓ పేజీలో రాసింది" అని తల్లిదండ్రులు తెలిపారు.


నిందితుడికి జ్యుడిషియల్ కస్టడీ..

కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రికి చెందిన ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారానికి సంబంధించిన కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు సంజయ్ రాయ్‌కు సీల్దా కోర్టు14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. శనివారం ఉదయం 10 గంటలలోగా కేసు డైరీ, సీసీటీవీ ఫుటేజీ తదితర వివరాలను సీబీఐకి అందజేయాలని కలకత్తా హైకోర్టు సిట్‌ని ఆదేశించింది. ఆగస్టు 9న ఈ హత్యాచార ఘటన వెలుగు చూసింది. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ సెమినార్ రూమ్‌లో వైద్యురాలి మృతదేహం కనిపించింది. పాశవికంగా దాడి చేసి, కిరాతకంగా హత్య చేసిన ఉదంతం దేశాన్ని కుదిపేసింది.


ఘటనను హ్యాండిల్ చేయడంలో సీఎం మమతా బెనర్జీ సర్కార్ విఫలమైందనే ఆరోపణల నడుమ కేసు సీబీఐ తన పరిధిలోకి తీసుకుంది. నిందితుడు సంజయ్ రాయ్ విచారణ సమయంలో సంచలన విషయాలు బయటకి వచ్చాయి. ఈ ఘటనపట్ల అతను పశ్చాత్తాపం వ్యక్తం చేయట్లేదని అధికారులు తెలిపారు. నిందితుడికి పెద్ద నేర చరిత్రే ఉందని దర్యాప్తులో తేలింది. అశ్లీల వీడియోలు చూస్తూ.. అసహజ శృంగారం చేయడం నిందితుడికి అలవాటు ఉన్నట్లు తెలిసింది. ఘటనకు ముందు కూడా అతను రెడ్ లైట్ ఏరియాలో తిరిగాడని పోలీసులు చెప్పారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసుకు సంబంధించి.. బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని, విధుల్లో ఉన్న వైద్యులకు సరైన రక్షణ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ వైద్యులు నిరసనలు తెలిపారు. అయితే సుప్రీం కోర్టు సూచనలతో నిరసనలు విరమించారు.

Updated Date - Aug 23 , 2024 | 07:29 PM