Share News

‘అదానీ’పై దుమారం

ABN , Publish Date - Nov 28 , 2024 | 04:58 AM

పార్లమెంటులో ‘అదానీ’ దుమారం ఆగడం లేదు. శీతాకాల సమావేశాల్లో రెండో రోజైన బుధవారం కూడా ఉభయసభల్లో ఎలాంటి కార్యకలాపాలూ జరగలేదు.

‘అదానీ’పై దుమారం

జేపీసీతో విచారణకు ప్రతిపక్ష సభ్యుల డిమాండ్‌

పార్లమెంటు ఉభయసభల్లో ఆందోళనలు

ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే వాయిదా

రేషన్‌ డీలర్లకు మార్జిన్‌ పెంచే యోచన లేదు

లోక్‌సభలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి

న్యూఢిల్లీ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటులో ‘అదానీ’ దుమారం ఆగడం లేదు. శీతాకాల సమావేశాల్లో రెండో రోజైన బుధవారం కూడా ఉభయసభల్లో ఎలాంటి కార్యకలాపాలూ జరగలేదు. ప్రతిపక్ష పార్టీల సభ్యుల ఆందోళనలతో లోక్‌సభ, రాజ్యసభ ఉదయం ఒకసారి వాయిదా పడ్డాయి. మళ్లీ సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో గురువారానికి వాయిదా వేశారు. లోక్‌సభ సమావేశమైన వెంటనే బుధవారం ఉదయం స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే అదానీ సంస్థపై వచ్చిన ఆరోపణల మీద చర్చించాలని; యూపీలోని సంభాల్‌లో జరిగిన హింసపై చర్చించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభను వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సభ మళ్లీ సమావేశమైనా పరిస్థితిలో మార్పు లేదు.

g.jpg

దీంతో లోక్‌సభను గురువారానికి వాయిదా వేశారు. ఇక రాజ్యసభలోనూ గందరగోళం నెలకొంది. సభలో కార్యకలాపాలన్నింటినీ నిలిపివేసి అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన 18 వాయిదా తీర్మానాలను చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ తిరస్కరించారు. సభ్యులు నిరసనకు దిగడంతో సభను వాయిదా వేశారు. వాయిదా తీర్మానాల్లో సగం కాంగ్రెస్‌ సభ్యులే ఇవ్వడం గమనార్హం. అవి కూడా అదానీ అంశంపైనే ఇచ్చారు. మిగిలిన సగంలో కొన్ని యూపీ, మణిపూర్‌ హింసపై చర్చ జరగాలని, మరికొన్ని ఇతర కారణాలతో వేర్వేరు పార్టీల సభ్యులు ఇచ్చారు. సభలో గందరగోళం నెలకొనడంతో గురువారానికి వాయిదా వేశారు. కాగా, ప్రభుత్వ మొండి వైఖరితోనే ఉభయసభలు వాయిదా పడ్డాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. అదానీ సంస్థపై వచ్చిన ఆరోపణల మీద చర్చించడానికి మోదీ సర్కారు ఇష్టపడడం లేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ అన్నారు. మొదానీ స్కాంపై జేపీసీతో విచారణ జరిపించాల్సిందేనని, తాము ఈ డిమాండ్‌ చేస్తూనే ఉంటామని చెప్పారు.


అదానీని అరెస్టు చేయాల్సిందే: రాహుల్‌

దానీని అరెస్టు చేయాలని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడారు. దేశంలో చిన్న చిన్న ఆరోపణలకే వందలాది మందిని అరెస్టు చేస్తున్నారని, అలాంటప్పుడు అదానీ ఎందుకు జైల్లో లేరని ప్రశ్నించారు. ‘జైల్లో ఉండాల్సిన ఆయన్ను ప్రభుత్వం కాపాడుతోంది’ అని రాహుల్‌ ఆరోపించారు. కాగా, అదానీపై వచ్చిన లంచం ఆరోపణల తీవ్రతను నీరుగార్చేందుకు ‘మోదానీ ఎకోసిస్టమ్‌’ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్‌ ఆరోపించారు. ఇటువంటి హాస్యాస్పద ప్రయత్నాలతో అమెరికా ఏజెన్సీలు చేస్తున్న ఆరోపణల తీవ్రతను తగ్గించలేరని స్పష్టం చేశారు.

Updated Date - Nov 28 , 2024 | 04:58 AM